హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౬

అలా “బిస్కేరీ” కాంపు ముగిసింది…

ఆ కాంపులో అనిపించింది. మన జట్టులో సరదా సరదా మనుషులు ఉండడం ఎంత ముఖ్యమో. లేకపోతే ఆ రోజు అంత ఎంజాయ్ చేసేవాళ్ళమా ? ఏమో ?
చక్కగా ఆడి పాడి, ఆడించి పాడించి భలే గడిపాము. ఆ రోజు రాత్రి కూడా గజ గజే…

మరుసటి రోజు ఉదయం మేము “బందక్ తాజ్” అనే కాంపు కేసి బయలుదేరాము. ఇది మా ఆఖరి కాంపింగు. అప్పటికే మా గుంపులో అందరూ అయ్యో అప్పుడే మనం కిందికి వెళ్ళిపోతున్నామా ? మంచు ఇదే ఆఖరా అని దిగులుగా ఉన్నారు.
నెమ్మదిగా, కొద్దిగా భారంగా ఆ కాంపుకి బయలుదేరాము. అనుకుంటాము కానీ కొన్ని సార్లు ఎక్కడం ఎంత కష్టమో, దిగడమూ అంతే కష్టం. అది ఆ రోజు మాకు బాగా అనుభవమయింది.

ఆ రోజు మేము ప్రయాణించిన దారి మరీ నిలువుగా ఉంది. దాని మీద దిగడం కోసం జారిపోకుండా పట్టుకోసం ఆపుకోవాల్సి వచ్చేది. దానికి అదనపు శ్రమ. ఎలాగయినా కష్టపడి కాసేపు నడిచిన తరువాత నేల చదునయింది కాసేపు.

ఆ రోజు ప్రయాణం పెద్ద ఎక్కువ దూరం కాకపోవడంతో సరదాగా ఆడుతూ పాడుతూ సాగుతున్నాము. అన్నట్టు చిన్నప్పుడు మీరు వంగుడు, దూకుడు ఆడారా ? ఆ రోజు మేము ఆడాము.
అసలే ఆ ఆటలో నేను కత్తి. భలే సరదాగా అనిపించింది.

ఆ రోజు జనాలకు ఒక పుర్రె దొరికింది (కోతి చేతికి కొబ్బరి చిప్ప లాగా). ఇక జనాలలో క్రియేటివిటీ తెగ పొంగింది. ఒకరు అదెట్టుకుని తపస్సు చేస్తే, ఇంకొకరు దానిని ఒక కర్రకి తగిలించి ఆదివాసీలలో కలిసారు.

అలా పరిగెట్టి అలసిపోయి లంచ్ కోసం ఆగాము. ఇంతలో వాన. ఇంతకు ముందు పనికిరాని ప్లాస్టిక్ కవర్లని అందరూ బయటికి తీసి దాని కిందే కానిచ్చారు.

అంతలో హర్షద్ తన దగ్గరున్న చిన్న బాలొకటి బయటకు తీసాడు. ఇక దాంతో ఆటలాడారు కాసేపు.

భలే సరదా సంఘటన జరిగింది ఆ రోజు. పాపం మన “అయ్యరు” లంచ్ టైములో కడుపు కదిలి తట్టుకోలేక చెట్టు చాటు కెళ్ళాడు. ఇక ఇలాంటి సందర్భం వదులుతారా జనాలు. గైడ్ కి చెబుతున్నట్టు “చలో చలో… దేర్ హో రహా హైన్” అంటూ ఒకటే గొడవ, అయ్యరుకి వినబడేటట్టుగా. అందరూ వంత పాడారు “చలో, చలో…” అని.

అంతే పాపం అయ్యరు జారుతున్న పాంటుని చేత్తో పట్టూకుని మరీ పరిగెత్తుకొచ్చేసాడు. మరదే “టిట్ ఫర్ టాట్” అన్నమాట 🙂
అక్కడ నుంచి కాంపు చేరే వరకూ గుర్రు గుర్రు… మాకు హిహిహిహి….

ఈ కాంపు చప్పగా ఉంటుందనుకున్నాము. కానీ మాకేం తెలుసు ఇక్కడ సూపరు మజా ఉంటుందని.

ఆ కాంపుకి మేము తొందరగా చేరడంతో రకరకాల ఆటలు మొదలుపెట్టాము.

ముందొక నాచ్ గానా అన్నమాట. సెంటర్లో రాంబాబు టైపులో ఎవరో ఒక బకరాని పెట్టి మొబైలు లో నుంచి ఒక పాట మోగించేది. డాన్సు చేయించేది.

అదయిన తరువాత నుంచి ఆటలు మొదలయ్యాయి. ఫుట్‌బాలుతో మొదలు. పదకొండు వేల అడుగుల పైన ఫుట్‌బాలు ఎంత మంది ఆడతారు చెప్పండి 🙂 అదో అనుభవం.

కాళ్ళు విరగ్గొట్టుకున్న తర్వాత జనాలు కబడ్డీ ఆడదామన్నారు. కానీ పాపం అమ్మాయిలు మరీ ప్రేక్షకుల్లా ఉన్నారని చెప్పి ఖో, ఖో కి మారాము.

అసలు ఎంత సరదా అనుకున్నారు. అబ్బే ఇదేమాడతాం అన్న జనాలు ఇంకొక గేమ్‌ ప్లీజ్ మేమూ ఆడతాం అన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు.

ఇక అక్కడ కాంపు లీడరుకి కొద్దిగా క్రియేటివిటీ ఎక్కువ. ఇంత చురుకయిన జనాలను ఊరికే ఎందుకు వదిలిపెట్టాలని ఒక ఆట సృష్టించాడు. పర్యావరణానికి సంబంధించిన ఆట అది. ఆట ఆడుతూనే జనాలను ఎడ్యుకేట్ చేస్తుందన్నమాట.

ఇంతకీ ఆటేమిటంటే ఒక పది జింకలు, రెండు పులులు ఉంటాయి. అలాగే ఒక అగ్ని, నీరు, గడ్డి, వేటగాడు కూడా (అన్నీ జనాలే). ఇచ్చిన పది నిముషాలలో జింకలన్నీ ఒక సారి నీటిని, గడ్డిని తాకాలి. అలాగే పులినుంచి, అగ్ని నుంచి, వేటగాడి నుంచి తమని తాము కాపాడుకోవాలి. అలా ఆఖరుకి మిగిలిన జింకలు విజేతలన్నమాట. బాగుంది కదూ…

అడవిలో జంతువులకు అవసరమయిన వనరులని ఆట ద్వారా చక్కగా చెప్పించాడు. అలాగే వాటికున్న ఉపద్రవాలనీ, ఫుడ్ చెయిన్ నీ కూడా. అందరమూ సరదాగా కాంపంతా పరిగెడుతూ ఆటాడేసాము.

ఈ కాంపులో కూడా చలి బాగానే ఉన్నా ఇంతకు ముందు విపరీతమయిన చలి తర్వాత పెద్దగా ఆనలేదు. హాయిగా నిద్రపోయాము డిన్నరు చేసి, బోర్నవీటా తాగిన తర్వాత.

(అదేంటో రాత్రిళ్ళు టీ, బోర్నవీటా తాగిన తర్వాత నిద్ర భలే వస్తుంది. నాకు కాలేజీలో కూడా ఇదే అనుభవం. మాకు పరీక్షల టైములో మేల్కోవడానికి టీ ఇస్తే అది తాగి వచ్చి గుర్రుపెట్టేవాళ్ళము 🙂

అరెరె… అన్నట్టు మీకు మా టెంటు జనాలను పరిచయం చెయ్యలేదు కదూ…

ఏంటీ జంగ్లీల్లా ఉన్నామా ? సరే ఈ సారి కొంచెం బుద్ధిగా…

ఇదే ఆఖరి కాంపు అవడంతో మరుసటి రోజు ఉదయం మా బేస్ కాంపు కి బయలు దేరామన్నమాట. మధ్యలో అందమయిన జలపాతాలు, చెక్క బ్రిడ్జీలు అలరించాయి.

అవి దాటిన తరువాత ఇదేంటి ఇక్కడెక్కడికో వచ్చేసాము అనిపించింది. జనాలు, చెట్లు చేమలు, పొలాలు మళ్ళీ తగిలాయి.
అక్కడ అలసిన పాదాలకు కాసేపు విశ్రాంతి ఇచ్చాము.

ఇక “బర్శైనీ” అనే చోటికి చేరి అక్కడి నుంచి “మణికారన్”, అటు నుంచి “కసోల్” చేరడంతో ట్రెక్కు ముగిసింది. హహ.., అన్నట్టు అన్ని రోజులు స్నానమే చెయ్యలేదు. మీకు గుర్తు లేదు కదూ ? కిందికొచ్చాక కాంపు బయటకెళ్ళి ఒక హోటలు లో రూము తీసుకున్నాము. (కింద టెంటులలో జనాలు మరీ ఎక్కువుండడంతో…)

అప్పుడు స్నానం చేస్తే చూడాలి. వంటి పై నుంచి పోసుకున్న నీరు మురిక్కాలువ పారుతున్నట్టు నల్లగా డ్రైనేజీ నీరు లాగా పారింది. అసలే నాకు కాస్త జుట్టు కాస్త పొడవేమో, అట్టలు కట్టి ఉంది అప్పటికే :-). దాన్ని క్లీను చేసేసరికి నా పనయిపోయింది. (ఓ మూడు షాంపూ పాకెట్లు బలిచ్చిన తర్వాత)

అందరూ తయారయిన తర్వాత మా బేసు కాంపుకెళ్ళి సర్టిఫికెట్లు అందుకోవడంతో ట్రెక్కుకి శుభం కార్డు పడింది.

మరుసటి రోజు కాంపులో ఊరికే గడపాలి అన్నమాట. టైమెందుకు వేస్టు అని రివర్ రాఫ్టింగు (అబ్బో అందులో ఎంత మజా అనుకున్నారు…) చేసి రాత్రి ఢిల్లీ కి బయలుదేరాము. ఢిల్లీ కథ (మథుర, తాజ్‌మహలు, వగయిరా…) రాయాలంటే ఇంకో రెండు టపాలు అవుతుంది కానీ ఇక ఇక్కడితో ముగిస్తాను 🙂
ఢిల్లీ అనుభవాలు దాదాపు ఈయనకు లాగానే ఉన్నాయి.

అలా ముగిసింది నా కల… కలా ? నిజమా ?

హమ్మయ్య ట్రావెలాఆఆఆఅగుడు అయిపోయింది. ఓ టపా లేటయినా మీకు విముక్తి 🙂

హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౫

అసలు చలి అంటే ఏంటో తెలిసొచ్చిన రాత్రి “తిలాలోట్నీ” లో గడిపినది. ఏదో బెంగుళూరు చలి తప్ప పెద్దగా చలి అనుభవం లేదాయే… (ఇంతకు ముందు కేదార్‌నాథ్ యాత్ర చేసినప్పుడు తప్ప)

ఆ తడిచిన బట్టలు వదిలేసిన తరువాత వెచ్చగా అనిపించినా తొందర్లోనే మళ్ళీ చలి మొదలయింది. కనిపించిన జాకెట్టూ, గ్లవ్స్, వులెన్ సాక్సూ వగయిరా లన్నీ వంటి మీద ఉంచుకుంటే గానీ తట్టుకోలేకపోయాము.

అదీ కాక సాయంత్రం ఆగిపోయిన మంచు కాస్తా చీకటి పడుతుండేసరికి మళ్ళీ మొదలు. అవును అన్నట్టు చెప్పడం మరచిపోయాను. మంచు ఎప్పుడూ చూడని వారికి మొదటి “స్నో ఫ్లేక్స్ ” మీద పడే అనుభవం ఉంటుందే అది అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెప్పలేనిది.

కొన్ని అనుభూతులు అలా మనతో ఉండిపోతాయి. వాటిలో ఇది కూడా ఒకటి.

సరే ఇక రాత్రి గడుస్తుండగా చలి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. లక్కు బాగుండి అక్కడ చక్కని స్లీపింగ్ బాగులు లభించాయి. వాటిలో దూరి కాసేపు వేడి కబుర్లు చెప్పుకుని నిద్రపోయాము.

అసలు నాకు అర్థం కానిదేమిటంటే ఇంట్లో ఉన్నప్పుడు నేను పొద్దున్నయింతర్వాత కానీ నిద్రపోను, తొమ్మిదిన్నరకి కానీ నిద్ర లేవను. కానీ ఈ కాంపులలో మాత్రం రాత్రి తొమ్మిదింటికల్లా నిద్రపొవడమే, ఉదయాన్నే ఐదున్నర ప్రాంతంలో నిద్ర లేవడమే. ఎలా సాధ్యమయిందో అర్థమే కాలేదు. (చెయ్యడానికి ఇంకేమీ లేకపోవడం మూలాన కాబోలు)

మరుసటి రోజు ఉదయం “సర్ పాస్” కేసి బయలుదేరాము. ఆ రోజు ఉదయం అందరికీ “యాస్ ఫ్రీజింగే” 🙂
కానీ ఉదయాన కనిపించిన దృశ్యాలు చూస్తుంటే అసలు కదలాలనిపించలేదు. పొరపాటున ఆ రోజు తొందరగా లేచినందుకు ఎంత భాగ్యం కలిగిందో అని మురిసిపోయాను.

ఆ రోజు ట్రెక్కుకి మామూలు రోటీ వగయిరాలు కాకుండా బిస్కెట్లు, కచోరీ లాంటి డ్రై ఐటెమ్స్ ఇచ్చారు.
పొద్దున్నే బయలుదేరాల్సింది కనీసం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాము ఆ రోజు, కాంపు లీడరుతో అక్షింతలు వేయించుకుని.
క్రితం రోజు అలవాటయింది కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు మంచులో నడవడం. అదీను ఆ రోజు వాన, మంచు కురవట్లేదు. కాబట్టి సాఫీగానే నడుస్తున్నాము. మేము ఉన్నది ఇంకొక కొండ, దాని మీద నుంచి మేము చేరాల్సిన “సర్ పాస్” కి వెళ్ళాలంటే కొంత దూరం దిగి మళ్ళీ ఎక్కాలి. సరదాగా సాగింది ప్రయాణం ఆరోజున. అదీ మేము చేరబోతున్న ప్రదేశం చేరుతున్నామనే ఉత్సాహంతో…

ఒక రెండు గంటలు నడవగానే చేరుకున్నాము “సర్ పాస్” కి. ఆ ప్రదేశం అని తెలియడానికి రాళ్ళతో మార్కు చేసారు అక్కడ.

నిజంగా అక్కడికి (13800 అడుగుల ఎత్తు) చేరుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. అసలు అరకిలోమీటరు దూరం కూడా రోజూ నడవని నేను (జిమ్ములో ట్రెడ్ మిల్ మీద పరిగెట్టడం వేరే విషయం) రోజుకి తొమ్మిది, పది కిలోమీటర్ల దూరం ఎత్తు పల్లాల మీద, మంచులో నడిచి ఆ ప్రదేశం చేరుకున్నానంటే నమ్మబుద్ధి కాలేదు. కాసేపు అక్కడ ఫోటోలు దిగాము.
అక్కడ నుంచి చూస్తే భూమి, ఆకాశం కలిసిపోయాయా అన్నట్టుగా అనిపించింది. మబ్బులకంటే పై ఎత్తులో ఉన్నాము మేము.

అన్నట్టు ఆ రోజున మాకు ఎలుగుబంటి అడుగుజాడలు కనిపించాయండోయ్… (ఎలుగుబంటి మాత్రం కనబడలేదు 😦 )

అక్కడో‌ చిత్రమయిన సంఘటన జరిగింది. ఆ రోజుకి మాతో వస్తున్న గైడు దగ్గర ఒక “పిక్ ఆక్స్ ” ఉంది. నేను హీరోలా ఫోజు కొడదామని దానిని పట్టుకుని ఫోటో దిగడానికి ఆ కొండ అంచు దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ అక్కడ దానిని పట్టుకుని కొండ ఎక్కుదామని ఫోజు ఇవ్వడానికి ఆ అంచులో కొంత కిందున్న మంచులోకి కాలేసాను. అంతే అది నా మోకాలు దాకా దిగబడిపోయింది.
పిచ్చా అన్నట్టు అరిచాడు మా గైడు. వెంటనే తేరుకుని పైకొచ్చేసాను. ఇంకొంత అజాగ్రత్తగా ఉంటే పిక్ ఆక్స్ ని నిజంగా వాడాల్సిన అవసరం వచ్చేదేమో 😉

మళ్ళీ ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే మా గ్రూపు లీడరుగా ఉన్న అతను (ప్రతీ ట్రెక్ చేసే గుంపూ ఒక లీడరు ని ఎన్నుకుంటారు తమ లో నుంచి. జనాలను టైముకి కదిలించడం, అందరూ ఉన్నారా లేదా, కలిసి వెళుతున్నారా లేదా అని అతను చూస్తాడన్నమాట) తన బాగులోనుంచి మువ్వన్నెల మన భారత జాతీయ పతాకం ఒకటి బయటకు తీసాడు.
అందరమూ కలిసి దానిని మంచులో పాతాము. జనగణమన గీతం పాడాము. కొందరు సిగ్గు పడ్డారు, మిగతా వాళ్ళము పాడాము. అదేంటో మన జాతీయ గీతం పాడుకునేందుకు సిగ్గెందుకో అర్థం కాలేదు.
అంత అందమయిన మన జెండా రెపరెపలాడుతుంటే ఛాతీ కొంత వెడల్పవదూ ?

అది అయిన తరువాత కొంత దూరంలో లంచ్ కోసం ఆగాము. మంచు పైనే ప్లాస్టిక్ షీటు ఒకటి పరచి దాని పైన కానిచ్చాము. అన్నట్టు నాకెందుకో ఒక వింత కోరిక కలిగింది. ఆ మంచులో అసలు స్వెట్టరు, గ్లవ్స్ గట్రాలు ఏమీ లేకుండా ఒక ఫోటో దిగాలని. ఇప్పుడు సిగ్గుపడితే మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని ఒక ఫోటో అలా కానిచ్చేసా.

అన్నట్టు ఆ గాగుల్స్ ఏదో స్టైలుకి పెట్టినవి కాదండోయ్… అసలు నా మొహానికి గ్లాసులేవీ బాగుండవు, సూటవవు. కానీ మంచులో నడుస్తున్నప్పుడు కనుక అవి ధరించకపోతే కళ్ళకు ముప్పు. మంచు మీద పడిన యు.వి కిరణాలు పర్యావర్తనం చెంది మన కళ్ళకి హాని కలిగిస్తాయి. అందుకని ధరించక తప్పదు.

మేము లంచ్ ముగించాక నడక మొదలెట్టామో లేదో మా గైడు భలే చక్కని వార్త చెప్పాడు. పైకి చేరుకున్నాక ఇక చేసేదేంటి ? కిందికి దిగడమే… మరి మంచు ఉంటే ?? స్లైడింగే 🙂
హహ… అనుకోకుండా భలే థ్రిల్లింగ్ గా అనిపించింది. సర్ పాస్ నుంచి కొద్ది దూరం నడిచిన తరువాత నుంచి ఒక మూడు స్లైడ్లు చేస్తే మేము వెళ్ళాల్సిన కాంపుకి వెళ్ళిపోతామని గైడు చెప్పాడు. (స్లైడంటే ఏదేదో ఊహించుకునేరు… స్కీలో, స్కేట్ బోర్డులో ఉండవు, స్లెడ్జీ ఉండదు. మనం కూర్చుని జారుడు బండ మీద జారినట్టు జుయ్యంటూ జారిపోవడమే… హహహ)

అంతకు ముందు రోజు ట్రెక్కులలో మేము చిన్న ప్రదేశం దొరికితేనే దాని మీద స్లైడు చేసి ఆడుకున్నాము. ఇప్పుడు కిలోమీటర్ల కొద్దీ (దిగువకి) స్లైడు చేసి జారిపోతే భలే బాగుండదూ ?
ఇక గబగబా నడిచేసి మొదటి స్లైడు దగ్గరికి చేరుకున్నాము. ఒకరిద్దరు కొంత భయపడ్డా నెమ్మదిగా ఒకరొకరుగా జారడం మొదలుపెట్టారు. నేను కూడా వెయిటింగు నా వంతు కోసం. శరీరం నిలువుగా ఉంచి, కర్రని తల వెనుకాల పట్టుకుని, బాగుని అటూ ఇటూ కాకుండా సర్ది జుయ్ఁ….

భలే భలే… కళ్ళు మూసి తెరిచేంతలో ఎంత వేగాన్నందుకున్నానో, అసలు భలే అనుభవం లెండి. ఆ వేగంలో ఏ కొద్దిగా బాలెన్సు తప్పినా తలకిందులుగానో, అడ్డదిడ్డంగానో కిందికొస్తాము. పెద్ద దెబ్బలేవీ తగలవనుకోండి. అది కూడా ఒక సరదా అనుభవం.

సమయం గడుస్తున్న కొద్దీ మళ్ళీ మంచు పడడం మొదలు. మొదటి స్లైడు చేసిన తరువాత కొంత దూరం నడవగానే మంచు దట్టంగా పడుతోంది. క్రితం రోజు జ్ఞాపకాలు వచ్చాయి జనాలకి. సరే అని వడి వడిగా నడవడం మొదలుపెట్టారు.
ఈ స్లైడింగు వల్ల చిక్కేమిటంటే మనం వేసుకున్న బట్టల మీదే జారడం వల్ల మీ వెనుక ప్రాంతమంతా తడి తడే… ఆరే ప్రసక్తే లేదు. అదే కాక స్లైడింగులో మంచు కాస్తా మీ బట్టల్లోకి దూరిపోతుంది. కాబట్టీ మళ్ళీ బట్టలంతా తడి తడి.

మంచు పడడంతోనే మళ్ళీ చలి మొదలయింది. అదీ జారడంతో కుడిన తడి వల్ల గజ గజ…
ఈ సారి మేము అందరికన్నా ముందుగా వెళ్ళిపోయాము. కొంత మంది మరీ నెమ్మదిగా వస్తున్నారు వెనుక. రెండో స్లైడు కొంచం దూరం తలకిందులుగా చేసిన తరువాత, మూడో స్లైడు మళ్ళీ బానే ఉంది. కాకపోతే తలకిందులుగా చేసిన స్లైడు వల్ల బట్టల్లో మొత్తంగా మంచు దూరిపోయింది.

మంచులో నీటి “స్ట్రీమ్‌” ఒకటి ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేకపోయాను. ఉంది, జలజల పారుతోంది. ఎంత ఆశ్చర్యమో నాకు.

నాకు బాగా వణుకు మొదలయింది… చేతులకి వులెన్ గ్లవ్సే కాక, లెదర్ గ్లవ్స్ కూడా తొడిగాను. అప్పటికి కొంత ఆగింది. మిగతా పార్టులకి ఏమీ చెయ్యలేని పరిస్థితి. మూడో స్లైడు అయింతర్వాత దాదాపు మా గైడు సహచరులు కొంత ముందుగానే అక్కడ ఒక చిన్న మొబైల్ కాంటీను తయారు చేసారు. టీ, మాగీ గట్రా అమ్మడానికి.
మేము అందరికన్నా ముందుగా చేరుకోవడంతో అక్కడ ఇంకెవరూ లేరు. వారు టీ కాస్తున్న మంటతోనే మేము చలి కాచుకుంటున్నాము. ఒక మాగీ, టీ ఒకటి ఆర్డరు చేసాము. కాస్త వెచ్చబడ్డాము. గంట సేపు పైన గడిచినా ఇంకా ఎవరూ రారే…

అయ్యరు మేమొచ్చిన కాసేపటికే చేరాడు. ఇక చెప్పేదేముంది కాలు కాలిన పిల్లి మాదిరే. గైడు తలని ఎంతగా తిన్నాడంటే నీ చావు నువ్వు చావు అన్నట్టు వాడు మాకు ఒక దారి చూపించి దీని గుండా పొండి, మీకు కాంపు తగులుతుంది అని చెప్పాడు.

ఇక ఎంతసేపని చలిలో ఉండగలమని మేమూ బయలుదేరాము. ఇక్కడ ఒక తమాషా సంఘటన జరిగింది. ఒక దగ్గర కిందికి వెళ్ళడానికి రెండు మార్గాలు కనిపించాయి. ఒకటి మంచులో వెళ్ళాలి, ఇంకోటి అంత మంచు లేకుండా బురద బురదగా ఉన్న ప్రదేశంలో నుంచి. రెండూ కింద ఒక దగ్గరే కలుస్తాయి.
అయ్యరు పుత్తరు వరుణ్ కాసింత ముందు బయల్దేరి మంచు మార్గంలో కిందికెళ్ళిపోయాడు. అంతలోనే గైడు ఇంకో మార్గం ద్వారా వెళ్ళమని అయ్యరుకి చెప్పాడు. ఇక అయ్యరుకి ఒకటే టెన్షను. వరుణ్ పైకి రా… అంటాడు. అప్పటికే అతను కిందికి చేరిపోయి రెండు దారులూ కలిసే చోట ఉన్నాడు. రెండడుగులు వేస్తే అక్కడికి చేరుకుంటానని చెప్పడు అయ్యరుతో.

అయినా అయ్యరు వింటే కదా ? వీల్లేదు ఆ రెండడుగులూ వెయ్యద్దు, పైకిరా అంటాడు. మేమందరమూ విస్తుపోయాము. అసలు ఇదేం పిచ్చి, ఇంతగా పిల్లలని కంట్రోల్ చేస్తే ఏదో రోజు ఏ కత్తో పెట్టి పొడిచెయ్యగలడనిపించింది. ప్చ్…
మళ్ళీ పైకంటా నడుచుకుంటూ వచ్చి బురదలోనుంచి దిగి అదే ప్రదేశానికొచ్చాడు పుత్తరు. జాలేసింది అతని మీద.

ఇక తర్వాత అయ్యరు ఒక దారి పడితే మేము ఇంకో దారి పట్టాము. బాగా చెట్లు గట్రాతో గుబురుగా ఉంది మేము వెళ్ళిన దారి. ఒక పది నిముషాలు నడిచిన తర్వాత గానీ అర్థం కాలేదు మేము తప్పిపోయామని…
ఇక వెనక్కెళ్ళాలా లేక ముందుకా అని కాసేపు తర్జన భర్జనలు పడి ఏదోకటయిందిలే అని ముందుకే సాగాము.
ఎటెటో వెళ్ళి మొత్తానికి ఒక అరగంట తర్వాత కాంపుకి చేరాము ఇంకేదో దారి నుంచి.

ఆ కాంపు లీడరెవరో భలే సరదా మనిషి. మేము అతనితో కాసేపు మాట్లాడి టెంట్లలోకి వెళ్ళిపోయాము. తడి బట్టలన్నీ ఒక తాడు కట్టి దాని మీద వేసేసాము. పొడి బట్టల్లోకి మారి జీడిపప్పులో కారం కలిపి మందు లేకుండా సైడు డిష్షు తినడం మొదలెట్టాము. (జీడిపప్పు ఎక్కడ నుంచి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా ? ఆ కథ చెప్పడం మర్చేపోయాను నేను… కసోల్ కి వచ్చేటప్పుడు హర్ష కవరు మర్చిపోయాడని చెప్పనుగా…. ఏం జరిగిందంటే ఆ వచ్చే ట్రిప్పులో కండక్టరు కవరు ఎవరో మర్చిపోవడం చూసి మా తర్వాత వచ్చే ట్రెక్కర్లకి ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత రోజు మళ్ళీ అది మా చేతికి చిక్కింది. ఎంత మంచి వారో కదూ…)
ఆవురావురుమంటూ తినేసిన తర్వాత ఇంకో సర్‌ప్రైజ్ మాకు. కాంపులో మామూలుగా అయితే ఫైరు వెయ్యకూడదు. కానీ మా పరిస్థితి చూసి కాంపు లీడరు పాపం మాతో వచ్చిన గైడులతో ఫైరు వేయించాడు. (కాకపోతే కాంపుకి అవతల, రూల్సు ఏవీ ఉల్లంఘించకుండా 🙂 )

నెమ్మదిగా ఒక గంట తర్వాత మిగతా జనాలందరూ కాంపుకి చేరారు. నెమ్మదిగా ఆ ఫైరు చుట్టూ మూగాము. ఇక అంత మంది ఫైరు చుట్టూ మూగితే ఊరికే ఉంటామా ? పాటలు మొదలెట్టారు జనాలు. కానీ దీనికో ప్రత్యేకత ఉంది. పాటలు మేము పాడకుండా గైడ్ల చేత పాడించాము. వాళ్ళ లోకల్ సాంగులని వారు పాడడం మొదలుపెట్టారు. ఫోక్, వారి సినిమా పాటలను పాడుతుంటే మేమూ వారితో గొంతు కలిపాము. వారితోటి డాన్సు కుడా ఆడించాము. వారితోటి మేమూనూ…

మీకు టైముంటే మా గుంపులో ఒకతను సృష్టించిన ఈ వీడియో చూడండి.

అబ్బో… మరచిపోలేము ఆ రోజు. అందరమూ మా తడిచిన బట్టలని ఆ మంట చుట్టూ ఆరబెట్టుకున్నాము. షూ, సాక్సులు కూడా… (హర్ష గాడి షూ కాస్తా డాన్సాడేటప్పుడు మంటల్లోకి తోసేసారెవరో… అది కాస్తా సైడుకి కాలిపోయింది…)

అలా ఆడుతూ పాడుతూ ఆ కాంపు కూడా ముగిసింది…..

హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౪

ట్రావెలాగుడు ౩ నుంచి కంటిన్యూ….

రెండో కాంపు “ఫౌలా పానీ” కి చేరుకున్నాము. చలి కొద్దిగా మొదలయింది. నడుస్తున్నప్పుడు, పగలు పూట బానే ఉండేది కానీ కాంపుకి చేరి కొద్దిగా సాయంత్రం అయేసరికి చలి మొదలయేది. చేతులు కడగడానికి పైపు (కుళాయి కాదు. అక్కడ పారే సెలయేటిలో ఓ పైపుంచితే నీళ్ళే నీళ్ళు.) కింద చెయ్యి పెడితే నాలుగైదు నిముషాల వరకూ మళ్ళీ స్వాధీనం లోకి వచ్చేది కాదు.

మనం తిన్న పళ్ళెం, గ్లాసయినా కనీసం కడగాల్సిందేనాయే… (ఒకట్రెండు రోజులు కడక్కుండా అలాగే వాడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి 🙂 )
అదేం చిత్రమో కానీ పైకెళుతున్న కొద్దీ తిండి రుచిగా అనిపించడం మొదలెట్టింది. రోజంతా నడవడం వల్లనేమో.

ఆ రోజు కాంప్ ఫైర్ భలే జరిగింది. పై కాంపులకెళుతున్న కొద్దీ జనాలెవరూ కాంప్ ఫైర్ కి ఇష్టపడలేదు. ఒక్కసారి స్లీపింగు బాగులో దూరితే బయటకొచ్చే కొశ్చెనే లేదన్నమాట. 🙂
కానీ ఆ కాంపు లీడరు పాపం చేసుకుందామంటే మా టెంటు అరువిచ్చాం. ఓ ముప్ఫై మంది దూరారు. ఇక పాటలు రాని వాళ్ళు పాటలు పాడి, డాన్సు రాని వాళ్ళు డాన్సు చేసి కాంపు ఫైరు చేసారు. ఫైరు కోసం మా టెంటులోని టార్చ్ వెలిగించారు లెండి.

మరుసటి రోజు ఉదయం లేచాను. కొద్దిగా సిగ్గుపడి ఓ అరగంట ముందే లేచాను ఓపెన్ డౌన్లోడ్ కోసం.
బాగా చలిగా ఉంది. పొద్దు పొద్దున్నే నేమో చుట్టు పక్కల సీనరీలు అదిరిపోతున్నాయి. తెల తెల వారుతోంది. చుట్టూ చెట్లు, అడవి.
ఇక ప్రకృతి ఆరాధన చేస్తూ ప్రకృతి పిలుపుకి సమాధానమిచ్చాను 🙂 (చెప్పుకోవద్దూ ఊళ్ళలో పొద్దున్నే చెంబట్టుకుని వెళ్ళే జనాలే గుర్తొచ్చారు)

ఇక మళ్ళీ మూడో కాంపు “జిర్మీ” కేసి ట్రెక్కు మొదలెట్టాము.
ఓ చోట పెద్ద గుట్ట మంచుతో కప్పబడి ఉంటే జర్రున జారుతూ కాసేపు ఎంజాయ్ చేసారు జనాలు. తర్వాత ఇంకో చిన్న మంచు ముక్క కనబడితే అందులో టగ్గాఫ్ వారు ఆడారు, జట్లుగా ఏర్పడి మంచుతో ఒకరి మీద ఒకరు యుద్ధాలు ప్రకటించారు.
అరే ఎంత బాగుందో ఇక్కడే ఆడుకుందామనిపించింది జనాలకి. అయ్యరు అప్పటికే చిందులు తొక్కడంతో జనాలు ముందుకు కదిలారు. అయ్యరు వరుణ్ మీద కొరడా ఝళిపిస్తూనే ఉన్నాడు. అలా వెళ్ళకు, అందరి కన్నా ముందుండాలి, గైడు చెయ్యట్టుకు నడవాలి….

దారిలో కొన్ని జంతువులు దర్శనమిచ్చాయి.

మధ్యలో ఓ చిన్న గ్లేషియర్ కనిపిస్తే దాని వెనక నక్కి జనాలందరినీ మంచు కి బలిచేసాము.

సరదాగా సాగింది ప్రయాణం. నెమ్మదిగా “జిర్మీ” కి చేరుకున్నాము. బాగా చలిగా ఉంది.
అక్కడి కాంపు లీడరు మాకు స్వాగతం పలికి టీ రెడీగా ఉంచాడు.

కాసేపయాక మా వాళ్ళు కాస్త దమ్ము లాగుతామంటే సరే కాసిని సీనరీలు చూడచ్చు కదా అని నేనూ బయలుదేరాను. వాళ్ళు ఓ దగ్గర ఆగి దమ్ము లాగడం మొదలుపెట్టారు. నేను అలా చెట్లూ అవీ చూస్తూ కొద్దిగా ముందుకెళ్ళాను. మా వాళ్ళు కాంపు లీడరు గనక వస్తే వారించమన్నారు (కాంపులో దమ్ము కొట్టకూడదు). సరే అని నేను ఓ రెండు ఫోటోలు తీసుకున్నాను.

ఎందుకో మరి ఆ లోపల వాళ్ళు పై నుంచి అరిచారు. నాకు సరిగా వినపడలేదు. వినపడేసరికి చూస్తే అక్కడున్న ఒక ఎద్దు ఒకటి వేగంగా ఎదురొస్తుంది. (ఒక క్షణం ఫోటో తీద్దామా అని ఆగాను 🙂 అంతలో బుద్ధి వెనక్కొచ్చి చటుక్కున పక్కకి తప్పుకున్నాను)

అది కిందకెళ్ళి మిగతా ఎద్దులతో పోట్లాట మొదలెట్టింది. సరే అని ఆ ఫోటోలే తీసుకున్నాను.

ఇక అక్కడుండడం శ్రేయస్కరం కాదని వెనక్కెళ్ళి కాంపు లీడరు చెప్పే కథలు వింటున్నాము. భలే విశేషాలు చెప్పాడు అక్కడి జనాల గురించి. అక్కడి జనాలలో తొంభై శాతం పైన ప్రేమ వివాహాలని, చాలా మంది పదహారేళ్ళు వచ్చేసరికే పెళ్ళి చేసేసుకుంటారనీ తెలిసింది. అక్కడి ప్రజల గురించి, వారి తిండి, పంటలు, ఇళ్ళ నిర్మాణం గురించీ ఎన్నో విషయాలు చెప్పాడు

అతనితో మాట్లాడుతూ ఉంటే తెలిసింది మరుసటి రోజు పూర్తిగా మంచులో ప్రయాణించాల్సి ఉంటుందని. అదీ కాక ఈ సారి పోయిన నలభయ్యేళ్ళలోనే ఎక్కువ మంచు కురుస్తుందనీ చెప్పాడు.
భలే థ్రిల్లింగుగా అనిపించింది.

అందరమూ గజ గజ వణుకుతూ వచ్చే రోజు కోసం వెయిటింగు.

వచ్చే రోజు ఉదయం చలి చాలా ఎక్కువగా ఉంది. పొద్దున్నే జనాలు ఓ అరగంట లేటుగా లేచి ఇంకా స్లీపింగు బాగులలోనే తొంగుంటున్నారు. అందరూ పక్కనోడి కేసి చూడడం అన్నమాట. ఇంకా వీడు లేవలేదు కదా అని మళ్ళీ వాడు కూడా ముసుగెయ్యడం.
ఎలాగయితే ఓ గంట లేటుగా లేచారు మా టెంటు జనాలు (మమ్మల్నొదిలేసి వెళ్ళిపోతామని బెదిరించడంతో…)

పళ్ళు జిల్లనిపించుకుని, టీ తాగి మళ్ళీ మంచు విషయం గుర్తుకొచ్చి ఉత్సాహంగా బయలుదేరాము. బయలుదేరిన కొద్ది సేపట్లోనే మంచు ముక్కలు ముక్కలుగా చాలా చోట్ల తగిలింది.

వెళుతున్న కొద్దీ పూర్తి మంచు ఎడారిలా అయిపోయింది. ఇక చుట్టుపక్కల నేలన్నది కనిపించడం లేదు. మొత్తం తెల్ల దుప్పటి కప్పినట్టు దట్టంగా మంచు.

అలా మేము నడుస్తుండగానే వర్షం మొదలయింది. అందరూ తడిచిపోయారు మొత్తం తల నుంచి పాదాల దాకా.

కొందరి బూట్లు వాటర్ ప్రూఫ్ కాకపోవడంతో నీళ్ళు లోపలికెళ్ళిపోయాయి. సాక్సులు అన్నీ తడిగా మారాయి.విపరీతమయిన చలి వెన్నులోంచి పుట్టుకొస్తుంది. అందరూ వణికిపోతున్నారు.

కాళ్ళు మంచులో పట్టు జారిపోతున్నాయి. కొంత మేర కొండ ఎక్కాల్సి ఉంది. బురద బురదగా తయారయింది. జారిపోతూ ఉంది. నడుస్తున్నాము.
ఎక్కడయినా ఆగుదామంటే అసలక్కడ కనుచూపు మేరలో కూడా ఏమీ లేదు. అంతా మంచే. ఇక ముందుకు నడవాల్సిందే. గైడేమో అయ్యరు తొందరపెట్టడంతో ముందుకెళ్ళిపోయాడు.

సరే అని దూరంలో కనిపిస్తున్న ఎర్ర బాక్ పాక్ లను ఆనవాలుగా పెట్టుకుని ముందుకి నడుస్తున్నాము ఆ వర్షంలో. ఏదో మంచంటే భలే సరదాపడ్డాము కానీ అంత చలి అసలు తట్టుకోలేకపోతున్నారు జనాలు. అలా ఓ గంటా గంటన్నర నడిచి ఉంటాము. ఎట్టకేలకు మా లంచ్ కోసం ఉంచబడిన టెంటు కనిపించింది.

హమ్మయ్య అని కూలబడ్డారు జనాలు. చిన్న ప్లాస్టిక్ టెంటులో యాభై మందీ కూలబడ్డారు ఒకరి మీద ఒకరు. చెప్పలేనంత చలి. దానికి తగినంతగా ఎవరూ సిద్ధమయి రాలేదు. నేనేదో పల్చటి జాకెట్ ఒకటి వేసుకుని ఉన్నాను. థెర్మల్స్ అసలే తీయలేదు. అలా ఎంత సేపు గడచిందో కూడా తెలియట్లేదు. వాన బాగా ఎక్కువయిపోయింది. జనాలు చలికి తట్టుకోలేక బీడీలు కూడా బయటకు తీసారు.

మీరు నమ్మరు కానీ చలికి తట్టుకోవడానికి మొదటి సారి సిగరెట్టు, బీడీ తాగిన జనాలున్నారు ఆ రోజున. ఇంకో అంకులు తన బాగులో నుంచి ఓ చిన్న బాటిలు తీసి ఓ పెగ్గేసాడు ఎవరూ చూడకుండా. ఏమీ తాగని మా లాంటి మంచి వాళ్ళు వాళ్లని చూస్తూ నిట్టూర్చారు.

ఎట్టకేలకు ఓ గంటన్నర తరవాత వర్షం నెమ్మదించింది. పూర్తిగా తగ్గకపోయినా ఇక బయలుదేరక తప్పదు. ముందుకెళుతున్న కొద్దీ వర్షం తగ్గింది కానీ మంచు పడడం మొదలయింది. చలి షరా మామూలే…
మంచు అలా పడుతూనే ఉంది మేము నడుస్తున్నాము. ఇక మా కాంపు “తిలాలోట్నీ” దగ్గరలోనే ఉందని చెప్పాడు మా గైడు.

సరే అని మేము నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాము. మా గుంపులో ఒకతనికి తలనొప్పి, కళ్ళు తిరుగుతుండడంతో ఆగాము. అంత త్వరగా నడవలేని వారందరితో కలిసి నెమ్మదిగా నడుస్తున్నాము కాసేపయిన తరువాత. మంచు దట్టంగా మారి తుఫానయింది. విపరీతంగా కురుస్తుంది. కాసేపయే సరికి ఓ కొండ అంచు మీద నుంచి దాటాల్సొచ్చింది.
అసలు ముందు కొన్ని అడుగుల దూరం కూడా కనిపించడం లేదు ఆ దట్టమయిన మంచుకి. వెనకాల మిగిలిన మా అందరికీ గుభేలుమంది కాసేపు. మంచు కూడా కొంత జారుతూ ఉంది. అడుగులో అడుగేస్తూ నెమ్మదిగా నడుస్తున్నాము భయం భయంగా… (నిజం చెప్పాలంటే నాకు పెద్దగా భయం వెయ్యలేదు. కానీ అది చెబితే జనాలెలాగూ నమ్మరుగా :)‌ )

కొద్దిగా వయసయిన వారికి, ఆడవారికి సహాయం చేస్తున్నాము నేనూ, హర్షద్, హర్ష…
మా గైడు మాకోసం వెనక్కొచ్చాడు. చాలా సేపు పట్టేస్తోంది అక్కడ, ఎందుకంటే ఎవరినీ దాటుకుని ముందుకెళ్ళలేము. అసలు ఒక్కరు నడవడానికే కష్టంగా ఉంది. అదీ జనాలు పొద్దున్న, మళ్ళీ ఇప్పుడు అనుభవాలతో కొంత గుబులుగా ఉన్నారు.

మధ్యలో మాతో పాటు వస్తున్న మంగళ అనే డాక్టరు కాస్తా పట్టు తప్పి ఆ అంచు నుంచి ఓ ముప్ఫై అడుగులు జారిపోయారు. గైడు కష్టపడి ఆవిడని పైకి తీసుకొచ్చాడు. ఇక ఎలా దాటామో మాకే తెలీదు. మొత్తానికి ఆవల చేరాము.
అది దాటిన తరువాత ఇంకొద్ది దూరం నడిచిన తరువాత మా కాంపు కనబడింది.

దానిని చేరేంతలో మంచు పడడం బాగా తగ్గిపోయింది (అన్నట్టు అక్కడ వాతావరణం నిముషాల్లో మారిపోతుంది. మంచు పడడం ఇంకాసేపట్లోనే ఎండ. అదీ కాక బాగా సన్ బర్న్ అవుతుంది. నేను అంతగా పట్టించుకోకపోవడంతో పూర్తిగా నా ముఖం అంతా సన్ బర్న్ అయిపోయింది.).

పూర్తిగా మంచులో కప్పబడి ఉన్న కాంపు ఎంతో అందంగా బాగుంది. మధ్యలో టెంట్లు.

మొత్తానికి బాగా తడచిపోయిన బట్టలు, బూట్లతో ఆ కాంపు చేరి వెంటనే వెచ్చని బట్టల్లోకి మారాము. వులెన్ గ్లోవ్స్, థెర్మల్స్ వేసుకుంటే గానీ శరీరం కొద్దిగా అదుపులోకి రాలేదు. కానీ ఆ రోజు జరిగిందంతా తలచుకుంటే భలే థ్రిల్లింగుగా, ఎక్సైటింగుగా అనిపించింది. జీవితంలో అసలు మరచిపోలేని అనుభవాలవి. కొంత మంది జనాలయితే బాగా భయపడ్డారు కూడా.

ఆ రాత్రంతా ఆ చర్చలతోనే సాగింది. ఒక్కొక్కరి అనుభవాలు చెప్పుకుంటూనే రాత్రి గడచిపోయింది. వచ్చే రోజే “సర్ పాస్” చేరతాము. అది మేము చేరవలసిన ఎత్తయిన మజిలీ అన్నమాట (13800 అడుగుల ఎత్తులో ఉంటుంది). ఇక దాని గురించి కాసేపు చర్చించుకుని నిద్దరోయాము.

వచ్చే టపాతో ఈ ట్రావెలాగుడుని పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తాను… మీకందరికీ విముక్తి 🙂

హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౩

రెండో భాగం అయిపోయిందా చదవడం ?

గుంపంతా ఆడుతూ పాడుతూ బస్సు టాపు మీద “షీలా” కి దగ్గరే ఉన్న “ఊంచ్ ధర్” కి చేరింది.

అక్కడ మాకోసం ఒక గైడు ఎదురు చూస్తున్నాడు (ఒక్కో ట్రెక్కు కోసం రోజూ ఒక్కో గైడు ఉంటాడు. ఇంతకు ముందు అయితే గైడు ఉండే వాడు కాడంట. కానీ రెండు మూడు సార్లు జనాలు తప్పిపోవడంతో ఇప్పుడు గైడుని ఇస్తున్నారు)

దాదాపు జనాలందరూ ఓ ఊతకర్ర కొనుక్కున్నారు అక్కడ. చాలా ఉపయోగపడింది.
ఎందుకంటే బాగా ఎత్తులు ఎక్కేటప్పుడు కాళ్ళ మీద మరీ ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంచుతుంది.

అలాగే కొద్దిసేపటికే అర్థమయింది ఏమిటంటే ఒక మంచి షూ ఉండడం ఎంత ముఖ్యమో. షూ కి మంచి గ్రిప్ ఉంటే చక్కని పట్టు దక్కుతుంది ఎక్కేటప్పుడు. ఇక ముందు కూడా కొన్ని ట్రెక్కులు చెయ్యాలనే ఆలోచన ఉండడంతో నేను ఒక కొత్త షూ కొనుక్కున్నాను. బాటా షోరూం లో ఉన్న వీన్బర్నర్. మంచి షూ. చాలా మంది హంటర్ బూట్లు వాడారు.

ఇక ఎవరి బాక్‌పాక్ లు వారి భుజాల మీద ఉంచుకుని నడవడం మొదలుపెట్టారు. (YHAI వారు మీకు కావలిస్తే పైకి తీసుకెళ్ళడానికి విడిగా బాక్‌పాక్ లు ఇస్తారు. మీకు కావాల్సిన సామాన్లు మాత్రమే అందులో సర్దుకుని మీ బాక్‌పాక్ కింద వదిలెయ్యవచ్చు.)
అందరూ బాక్‌పాక్ లను తేలికగా సర్దుకున్నారు. ఎందుకంటే అవి భుజాన వేసుకుని ఎక్కాలి కాబట్టి. అంటే వేసుకున్న బట్టలు కాక ఇంకొక జత, స్వెటరు, జాకెట్టు, గ్లోవ్స్, ప్లేటు, గ్లాసు, కోల్డ్‌క్రీము/వాసెలీను, వగయిరాలన్నమాట. అవి సర్దుతున్నప్పుడే అర్థమయింది నాకు ఇక మిగతా రోజులన్నీ స్నానం కుదరదని 🙂 (హర్షద్, యోగేష్ లు ఎందుకు నవ్వారో కూడా).

YHAI వారి ట్రెక్కులో నాకు నచ్చిందేమిటంటే‌ వాళ్ళు తొందర పెట్టరు. కావలసినంత సమయం తీసుకుంటూ ఇతర కాంపులకు చేరవచ్చు. అందుకని ఎన్నో విషయాలు గమనిస్తూ. ట్రెక్కుని ఆస్వాదించవచ్చు. (అందరూ అలా చేస్తారని కాదు)

మొదటి రోజు “షీలా” గ్రామం గుండా ట్రెక్కు “గుణా పానీ” అనే కాంపుకి చేరుతుంది. ఈ ప్రాంతం అంతా కొండలే. ఇక్కడి గ్రామస్థులు చక చకా ఎక్కగలరు. మా గుంపులో కొంత మంది ఆడవారికి మొదటి రోజే ట్రెక్కు చెయ్యడానికి వారి ఫిట్‌నెస్ సరిపోదని తెలిసివచ్చింది. వారు ఈ గ్రామస్థులను పోర్టర్లుగా పెట్టుకున్నారు. (అంటే వీరి బాగులు వారు మోస్తూ వస్తారన్నమాట).

నాకయితే నచ్చలేదు అలా చెయ్యడం. ముందే తెలుసుకుని ఉండాల్సింది ట్రెక్కు చెయ్యగలమో లేదో. ట్రెక్కులో మజా అంతా సొంతంగా చేసుకోవడమే కదా. కానీ వారి దృష్టి నుంచి ఆలోచిస్తే ఇటు వెనక్కు వెళ్ళలేరు కాబట్టి పోర్టర్లని పెట్టుకుని ముందుకి సాగడమే మంచిదని అనిపిస్తుంది.

సరే అలా “షీలా” గ్రామం మీదుగా వెళుతుంటే తారసపడిన గ్రామస్థులు, వారి జీవన విధానాలు భలే ఆసక్తికరంగా ఉన్నాయి. వారి ఇళ్ళ నిర్మాణం, చెక్కలతో కట్టిన ఇళ్ళూ, పంట పొలాలు, పెంపుడు జంతువులు, చిన్న పిల్లలు, స్కూలు అన్నీ భలేగా ఉన్నాయి.

అక్కడి వ్యక్తులు స్వచ్ఛంగా నవ్వుతూ కనిపించారు.

అక్కడి ఇళ్ళు కూడా సుందరంగా ఉన్నాయి. అన్నీ చెక్కతో నిర్మించినవే. కప్పు మీద రాళ్ళతో ఇంకో లేయరు ఉంటుంది గాలి దుమారాలకి ఎగిరిపోకుండా పటిష్ఠంగా నిలవడానికనుకుంట.

అలా ఆహ్లాదంగా సాగుతున్న ట్రెక్కు మధ్యాహ్నం లంచ్ కి ఆగిన చోట ఏవో సణుగుళ్ళు వినిపించాయి. ఏమిటా అని చూస్తే “అయ్యరు” చిటపట మంటున్నాడు. సంగతేమిటని కనుక్కుంటే అందరూ త్వరగా కదలట్లేదని గైడు దగ్గర విసుక్కుంటున్నాడన్నమాట. పాపం ఇలాంటి ఆనందాలన్నీ అతనికి పట్టినట్టు లేవు. సర్లే పూర్ ఫెలో అని అతని మానానికి అతనిని వదిలేసి మా ట్రెక్కు మా వేగంతో మేము కదిలాము.

ఆ రోజు సాయంత్రం “గుణా పానీ” కి చేరుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఇంకో కాంపు లీడరు మా కోసం ఎదురు చూస్తున్నాడు. అందరికీ టెంట్లు అప్పటికే వేసి ఉన్నాయి. ఎవరయినా ఏ టెంటులోనయినా ఉండవచ్చు కానీ కింద ఏ విధంగా అయితే సర్దారో పైన కూడా అదే విధంగా సర్దుకున్నారు జనాలు. కింద మేము వేరే టెంటులోకి దూరడంతో మేము అయ్యరు టెంటు కాక వేరేదాంట్లో చేరాము. మాతో పాటు బెంగుళూరు నుండి వచ్చిన ఇంకో గుంపు చేరింది.

అక్కడికి చేరగానే ఓ “వెల్కం డ్రింక్” ఇచ్చారు, తర్వాత కొంత సేపటికి వేడి టీ ఒకటి, షరా మామూలే తర్వాత డిన్నరు. అదయ్యాక అందరూ టెంట్లలోకి ఉపక్రమించారు వారి వారి స్లీపింగు బాగులు, రగ్గులు తీసుకుని. మాతో కలిసిన బెంగుళూరు గుంపు మంచి అల్లరి మూక అవడంతో మాకు భలే టైం పాస్ అన్నమాట. (మగాళ్ళ చర్చలన్నీ ఎక్కువగా సెన్సార్డు గా ఉంటాయి కాబట్టి వాటి గురించి ఇక్కడ మాట్లాడను 😉 )

అలా నిద్రలోకి జారుకున్నాము. ఉదయం తొమ్మిదింటికి వేరే కాంపుకి ప్రయాణం. స్నానాలు లేవు గనక చేసుకునే వాళ్ళు బ్రష్ చేసుకుని టీ తాగి, బ్రేక్ఫాస్ట్ తిని, లంచ్ పాక్ చేసుకుని వెళ్లడమే.
హహ… వచ్చిందా డౌటు మరి ఒకటి, రెండు ఎక్కడా అని అక్కడున్న రాళ్ళు, చెట్లన్నీ మీవే 🙂

ఇక రెండో రోజు ఉదయం కాంపు లీడరు ఇవాళ మీరు గ్లేషియర్ దాటాల్సి రావచ్చని చెప్పడంతో అందరిలోనూ ఉత్సుకత. (గ్లేషియర్ అంటే మంచు పెళ్ళలు విరిగినప్పుడు కిందికి జారతాయి. అలా జారినవి కరిగే వరకూ అక్కడే మకాం అన్నమాట). బయల్దేరిన కాసేపట్లోనే మాకు గ్లేషియర్ ఎదురయింది. మేమేదో మంచు లాగా ఉంటుందనుకుంటే అది కొద్దిగా హార్డు ఐసు అన్నమాట.

నెమ్మదిగా దాని మీద నడవటం మొదలుపెట్టాము.

నెమ్మది నెమ్మదిగా పట్టు జారకుండా నడుస్తున్నాము. అంతలో జర్రుమని జారాడు ఒకడు, అతనిని నిలువరించడానికి అతనితో పాటు గైడు. ఐసు/మంచులో జారినప్పుడు నిలువరించడానికి మన షూ హీలుని గట్టిగా దాంట్లో దింపితే కొద్దిగా పట్టు దొరుకుతుంది.

కానీ జారిన షాకో ఏమో ఆ కుర్రాడు మాత్రం అసలు ఏ ప్రయత్నమూ చెయ్యలేదు. అలా ఓ ఇరవై అడుగులు దాదాపు కిందికి జారిన తరువాత గైడు ఎలాగో ఆపాడు. కానీ ఈ జారడంలో అతని కాంటాక్టు లెన్సు ఒకటి పడిపోయింది. అరగంట వెతికినా అది దొరకలేదు. (పైన బొమ్మలో ఆ కుర్రాడూ, అతని నాన్న పడిపోయిన లెన్సు కోసం వెతకడం కనిపిస్తుంది.)

ఎలాగయితే ఆఖరుకి అందరూ ఆవల పక్క చేరారు.

అది దాటిన తరువాత ఐసు గానీ, మంచు గానీ పెద్దగా తగల్లేదు. అవాంతరాలూ ఎదురవలేదు. రెండో‌ కాంపు “ఫౌలా పానీ” కి చేరుకున్నాము…

హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౨

మొదలెట్టాక ఇక ఆగకూడదు కదా…

మాకివ్వబడిన టెంటులలో చేరాము మేము నలుగురమూ. అయ్యరు అప్పటికే ఒక ఎర్ర రంగు బాక్ పాక్ లో ఏదో సర్దుతూ కనిపించాడు.

మేము మా బాక్‌పాక్‌లు టెంటులో పడేసే లోపల అయ్యరు తను YHAI నుంచి మూడు ట్రెక్కులు పూర్తి చేసాననీ, తను సకుటుంబ సపరివార సమేతంగా ఈ ట్రెక్కుకి వచ్చానని, తనో కత్తి కటారిననీ, ఇప్పుడు పక్కనే ఉన్న “మణికారన్” అనే టౌనుకి వెళ్ళి వేడి నీళ్ళ స్ప్రింగులో స్నానం చేసి వద్దామని బయల్దేరుతున్నాననీ మా చెవిలో వేసేసాడు (తోసేసాడు అనాలేమో ?)

పుత్తరు పేరు వరుణ్. పెద్దగా మాట్లాడలేదు.

అయ్యరు మాట్లాడిన పది నిముషాలలో
“వరుణ్… వెళ్ళి స్నానం చెయ్యి…, వరుణ్ బట్టలు మార్చుకో…, వరుణ్ బూట్లేసుకో…”
లాంటి డైలాగులు చాలా వినబడ్డాయి. అప్పటికే మాకు అర్థమయ్యింది అతనో పెద్ద కంట్రోల్ ఫ్రీకని.

మమ్మల్ని అలా బతికించి అయ్యరూ, పుత్తరూ వేడి నీళ్ళ స్నానానికి వెళ్ళిపోయారు.

ఇంతకీ మీరు గమనించారో లేదో నేను స్నానం చేసి దాదాపు మూడు రోజులయింది. (కంపా… నాకేమీ రాలేదే ?)

ఇక “కసోల్”లో వెళ్ళిన మధ్యాహ్నం పూట బానే ఉంది కానీ కాసేపట్లోనే వాతావరణం చలిగా అవడం మొదలెట్టింది (ఇంతకు ముందు చెప్పలేదనుకుంట, కసోల్ 6500 అడుగుల ఎత్తులో ఉంది). స్నానం చెయ్యడానికి తెగ ఉత్సాహపడిన మనసు ఇప్పుడంత అవసరమా అంది. అబ్బే కాసేపు వాయిదా వెయ్యచ్చు అని సమాధానం రావడంతో అక్కడ బేస్ కాంపులో ఇస్తున్న “ఛాయ్” ని ఓ గుటకేసాము (పట్టేసారూ, ఇంకా బ్రష్ చేసుకోలేదనీ… మరదే)

మళ్ళీ టెంట్లలో దూరాము, మనమూ వెళ్ళి వేడి నీళ్ళ స్నానం చేద్దామా ? అని హర్ష అన్నాడు. కానీ ఆ ప్రశ్న అడగగానే ఎందుకో పశ్చాత్తాపపడుతున్నట్టు కనబడ్డాడు. సరేలే వాడిని కాపాడదామని నేను అబ్బే మనం ప్రయాణం చేసి అలసిపోయాము కదా… ఇలా కానిచ్చేద్దాం అన్నా…

కానీ కొంత సేపటికే టెంటులో ఎలక చచ్చిన వాసన వస్తుండడంతో మేము స్నానం చెయ్యక తప్పదని అర్థమయింది. ఒంటి మీద మొదటి మగ్గు నీళ్ళు పడడంతోనే జిల్లు మంది. వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. అయినా సరే ధైర్యంగా స్నానం ముగించి బయటపడ్డాను.

ఇక్కడే ఇంత చలిగా ఉంటే పైన మనం స్నానం ఎలా చేస్తామో అన్నా… హర్షద్, యోగేష్ ఒకరినొకరు చూసుకుని ఫెళ్ళున నవ్వడం మొదలెట్టారు. నాకర్థం కాలా…

సరే స్నానం అయింది కదా అని అందరమూ కసోల్ చుట్టి వద్దామని బయల్దేరాము. కసోల్ గురించి కొంత చెప్పాలి. చిన్న ఊరు అది. ఊరంతా ఇస్రాయిలీలు నిండి ఉంటారు. ఎందుకంటారా ? ఊరిలో గడ్డి (grass) బాగా లభిస్తుంది. (అర్థం కాలేదా ? హు… వికీ లంకె మీద నొక్కండి.)

ఇస్రాయిలీ భామలు మాత్రం చాలా అందంగా ఉన్నారు. మన పక్కన ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉండడం ఎంత మంచిదో అప్పుడు తెలిసొచ్చింది. అదీ ట్రైపాడ్ తో సహా…
(ఎక్కడ మాంచి భామ కనబడినా మీ ఫోటో తీసుకోవచ్చా ? నేనో ఫోటోగ్రాఫరుని అని ట్రైపాడ్ చూపించగానే అమ్మాయిలు చటుక్కున ఒప్పుకునేవారు…)

ఓకే ఓకే… అదొదిలేస్తే విదేశీయులు చాలా మంది ఉన్నారు కాబట్టి కరెన్సీ మార్పిడి, బుల్లెట్/ఎన్‌ఫీల్డు బైకులు అద్దెకిచ్చే షాపులు అడుగుకొకటి. అలాగే తిండి ధర కూడా ఎక్కువే. కానీ జర్మను, ఇస్రాయలీ తిండి దొరుకుతుంది అక్కడ. మేము అక్కడే ఉన్న జర్మన్ బేకరీలో తెగ తిని కడుపు నింపుకున్నాము. నిజం చెప్పొద్దూ రుచి మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి.

అలా తిరిగి తిరిగి టెంటుకి చేరుకున్నాము. మేము వెనక్కి రావడమే ఓ చిన్న సైజు గుంపు కనబడింది ఎంట్రన్సులో… అదేంటబ్బా ? ఏమయింది అనుకున్నంతలోనే తెలిసింది మొత్తం బేసు కాంపులో కరెంటు ఉండేది ఆ ఒక్క చోటులోనే అని. (జనాలు మొబైలు ఫోన్లు, బాటరీ ఛార్జర్లతో ఎగబడుతున్నారు. మేము చాలా తెలివి గల వాళ్ళం. ఇంటికి కాల్ చేసి వెంటనే స్విచ్చాఫ్ చేసేవాళ్ళం. పిచ్చి వెధవలు, ఇక్కడికి వచ్చి కూడా కొట్టుకుంటున్నారు)

అప్పటికే సాయంత్రం అయింది. టెంటుకెళ్ళే సరికి టెంటు నిండా అన్ని రకాల జంతువులు కనబడ్డాయి. బెంగుళూరు నుంచే ఓ పెద్ద గుంపు దిగబడింది. ఓ పది/పదిహేను మంది జనాల గుంపు. అప్పటికే పేకాట మొదలెట్టారు. చచ్చాం అనుకున్నంతలోనే డిన్నర్ కి రమ్మని ఓ విజిలు. మరీ ఏడింటికేనా ? అనుకుని మా ప్లేట్లు గట్రా పట్టుకుని బయల్దేరాము.

చపాతీలు, అన్నం, కూర, స్వీటుతో బానే ఉంది. చపాతీలు వేడిగా తినకపోతే మాత్రం దాంతో టగ్గాఫ్ వారు ఆడుకోవచ్చు. అప్పుడు తెలిసింది అదేదో తొమ్మిదింటికి “కాంప్ ఫైర్” ఉంటుందిట. అబ్బ భలే బావుంటుంది చలి కాసుకోవచ్చు అనుకున్నంతలోనే తెలిసింది అది ఫైర్ లేని కాంప్ ఫైరని (అక్కడ నిజం కాంపు ఫైరు నిషేధముట). ఇంతకీ విషయమేమిటంటే ఆ కాంపు ఫైరు దగ్గర ఎవరయినా పాటలూ గట్రా పాడదలచుకుంటే పాడచ్చని.

మనకంత సీను లేకపోవడంతో సుబ్బరంగా కూర్చుని కామెంట్లు మాత్రం చేసాము… ఇంతకీ ఫైరెలా చేస్తారో మీకు తెలుసా ? ఒక ఎలెక్ట్రిక్ లైటు తీసుకొచ్చి, దానికొక ఎర్ర పేపరు చుట్టి దాన్ని స్విచాన్ చేస్తే అదే కాంపు ఫైరు 🙂
తమాషా ఏమిటంటే మేము మొదటి రోజు కాంపు ఫైరుకి కూర్చుని పైకి చూస్తే అక్కడ కొద్దిగా దూరంగా కొండల మీద నిజంగా ఫైరే కనబడింది. అక్కడ అడవిలో మంటలట. పెద్దగా మంటలు లేచి చెట్లు తగలబడడం కనిపించింది.

మా ముందు బాచులో నుంచి పిల్లకాయలు (పదో క్లాసు స్కూలు పిల్లల గుంపు) పాటలు, జోకులూ చెబితే అవి విని మేము బయల్దేరబోతుండగా చెప్పాడు అక్కడి కాంపు లీడరు (ట్రెక్కులో ప్రతీ కాంపుకీ ఒక కాంపు లీడరు ఉంటాడు. అతను చెప్పిందే అందరూ వినాలన్నమాట. ఆ కాంపుని మొత్తం నడిపించే బాధ్యతంతా ఆ కాంపు లీడరుదే) మరుసటి రోజు ఉదయాన్నే ఐదున్నరకి ఒక రెండున్నర కిలోమీటర్ల జాగ్, తర్వాత ఎక్సర్సైజూ ఉంటాయి అని.

మన రియాక్షను తెలిసిందే. ఉదయాన్న తొమ్మిదిన్నరకి లేచే నాకు అది మింగుడుపడలేదు కానీ తప్పదుగా. అక్కడ ఇచ్చిన బోర్నవీటా పుచ్చుకుని టెంటుకి వెనక్కొచ్చాము. ఆ మందలో పడుకోలేము కానీ ఇలా కాదని గుట్టు చప్పుడు కాకుండా మరుసటి రోజు బాచు కి కేటాయించిన టెంటులో పాగా వేసాము మేము నలుగురమూ. ఇంకో ఇద్దరు వచ్చి మాతో జత కలిసారు. (అచిన్, క్రిస్టో)

పొద్దున్నే ఐదున్నరకల్లా విజిలు… బ్రషింగు ఎలాగూ లేదు. ఆ రెండున్నర కిలోమీటర్లు జాగింగ్ చేసుకుంటూ వెళితే (ముప్పావు మంది వాకింగే) అక్కడ ఒక పెద్ద గ్రౌండు ఉంది. అక్కడ మా చేత డాన్సాడించిన తర్వాత మళ్ళీ వెనక్కి. మళ్ళీ అనౌన్స్మెంటు ట్రెక్కుకి అలవాటు పడటానికి ఇవాళ ఓ వెయ్యిన్నర అడుగులు ఎక్కిస్తారుట. (ట్రెక్కులో మొదటి మూడు రోజులూ కేవలం అలవాటు పడటానికే)

అందరికీ కొద్దిగా ఉత్సాహంగా అనిపించింది. ఆ వెయ్యిన్నర అడుగులు సులువుగానే అనిపించింది. ఆ రోజు అలా ముగిసింది.
మూడో రోజు “రాక్ క్లైంబింగూ”, “రాప్లింగూ” లాంటివి చేయించారు.

అక్కడితో మేము ట్రెక్కు చెయ్యడానికి తయారయ్యామన్నమాట.

నాలుగో రోజు ఉదయమే ట్రెక్కు మొదలు. ట్రెక్కుకి మొదలు అక్కడికి ఒక గంటన్నర దూరంలో ఉన్న “షీలా” అనే ఊరి నుంచి. అక్కడికి బస్సు టాపు మీదెక్కి చేరాము. అందరిలోనూ ఉత్సాహం, ఉత్కంఠ. గోల గోలగా అక్కడికి చేరింది గుంపు.

హిమాలాయాలలో ట్రెక్కు – ట్రావెలాగుడు ౧

సరే… రానారె ట్రావె’లాగుడు’ రాయమని చెప్పాడుగా… అదీ ప్రయత్నిద్దాం.

ఇంతకు ముందు టపాలో చెప్పినట్టు నేనూ, నా స్నేహితుడు హర్ష (కన్నడిగుడు, నా సహోద్యోగి) హిమాలయాల్లో ట్రెక్కింగుకి వెళదామని నిర్ణయించేసుకున్నాము. ఆ మేరకు మా డేమేజర్ల నుంచి అనుమతి కూడా సంపాదించేసుకున్నాము.

ఇక ట్రెక్కుకి రిజిస్టరు చేసేసుకున్నాము కూడా. ఇక్కడ కొంత మేము ట్రెక్కుకి వెళ్ళిన సంస్థ గురించి చెప్పుకోవాలి. దాని పేరు YHAI (Youth Hostels Association of India). దీని మాతృక విదేశమయినా, ఇది భారతానికి సంబంధించిన ఛాప్టరు అన్నమాట. వీరు అడ్వెంచర్ ట్రెక్కింగులు, మొదలయినవి ఆర్గనైజ్ చేస్తారు. అదీ కాక వీరు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను.

అంటే మన జేబులకు చిల్లు పడదు, ఫలితమూ దక్కుతుంది. ఈ హిమాలయన్ ట్రెక్కు మేము చేసింది ‘సర్ పాస్‘ అని. దీనికి గాను వారికి మేము చెల్లించిన మొత్తం కేవలం రెండు వేల అయిదు వందల రూపాయలు. అదీ టెంటులూ, అన్నపానీయాలూ కలిపి. ఇంత తక్కువలో వారు చెయ్యగలగడం చాలా ఆశ్చర్యకరం.

సరే ఎలాగయితేనే వారి ద్వారా ఈ ట్రెక్కుకి సంబంధించి బుకింగు చేసుకున్నాము. ఈ ట్రెక్కుకి ఖరారు చేసుకోవడానికి మన ఆరోగ్య స్థితి బాగుందని ఒక డాక్టరు సర్టిఫికెట్టు కూడా జతచెయ్యాలి. అలాగే నాకేం జరిగినా వారి బాధ్యత కాదని ఒక పేపరు మీద సంతకం చెయ్యాలి.

ఆ సంస్థ కి చందాదారు అయి, అవన్నీ పూర్తి చేసిన తరువాత మా చేతికి మేము మే ౩న ట్రెక్కు మొదలెట్టాల్సుంటుందని ఒక పేపరు చేతికి వచ్చింది.

ఇక దానికి సన్నాహాలు మొదలు.

ట్రెక్కు ఎలా సాగుతుందంటే సభ్యులందరూ “కులూ” లో ఉన్న ఒక పల్లెటూరు లో ఉన్న “బేస్ కాంపు” కి చెప్పిన తారీఖులో రిపోర్టు చెయ్యాలి. అక్కడ నుంచి పదకొండు రోజుల ట్రెక్కు మొదలవుతుంది.

ఇక మేము ఢిల్లీ కి రైలు టికెట్టులు బుక్ చేసుకున్నాము (ఏం చేస్తాం, మిడిల్ క్లాసు కి అలవాటుపడ్డ ప్రాణాలు. ఇప్పుడు సంపాదించినా ఎగిరెళ్ళడానికి అంత ఎక్కువ ఖర్చు పెట్టబుద్ది కాలేదు). ఢిల్లీ నుంచి “బేస్ కాంపు” కి మళ్ళీ వేరే ప్రయాణం.

జనాల ఉచిత సలహాలు అప్పటికే మొదలయ్యాయి. అక్కడ అలా ఉంటుంది, ఇవి పట్టుకెళ్ళండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి. అయ్యో రైల్లో వెళుతున్నారా ? ఎండ వేడికి మాడి మసయిపోతారు వగయిరా, వగయిరా…

అయినా అనుకున్న ప్రకారం కొత్తయినా సరే మమ్మల్ని మేము నమ్ముకుని, అలాంటి ట్రెక్కులు చేసిన ఇతరుల నుంచి కొంత సమాచారం సేకరించి ఏ సామానులు పట్టుకెళితే అవసరానికి పనికొస్తాయో కనుక్కున్నాము.

ఓ ఆదివారం (మీరు సరిగ్గా ఊహించారు, వెళ్ళే ఒక రెండు రోజుల ముందు) త్యాగం చేసి ఒక బాక్‌పాక్, ఇతర అవసరమయిన టాయిలెట్ పేపరు, టిష్యూలు, ఓ షూ వగయిరా అన్నీ షాపింగు చేసి తయారయామనిపించాము.

ఏప్రిల్ ౩౦ న వర్షంలో తడుస్తూ మొత్తానికి కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఎక్కి బయల్దేరాము. రైల్లో టైం పాస్ చెయ్యడానికి పెద్ద సరంజామా ఏమీ తీసుకెళ్ళలేదు. నా ఎంపీత్రీ ప్లేయరు మాత్రం తోడుంది. ఇక ఇద్దరమూ ముచ్చట్లేసుకుని అలా అలా ప్రయాణం సాగించాము. మధ్యలో అలా కిటికీ లోంచి ఆ పొలాలు, మనుషులూ, వారి జీవన విధానాలు మాకు చూపిస్తూ ఆ రైలు అలా మమ్మల్ని మోసుకెళుతూ ఉంది.

డామేజర్లని కాసేపు మననం చేసుకుని (వారి మీద కాసిన్ని చమక్కులు వేసుకుని, కాసేపు పాపం మంచోళ్ళు మనకు సెలవిచ్చారని పొగిడి) రాబోయే రోజులని తలచుకుంటూ జోగుతూ ఢిల్లీ చేరుకున్నాము.

ఓ… అన్నట్లు చెప్పడం మరచాను. నా బాక్‌పాక్ ని కొద్దిగా ఓవర్ స్టఫ్ చేసాను. అది ఎంచగ్గా ఢిల్లీ లోని చెత్త ఐఎస్బీటీ బస్ స్టాండుకి వెళ్ళగానే పుటుక్కుమంది (దాని తప్పు కాదు నాదే). దానినో చెప్పులు కుట్టే వాడి చేత బాగు చేయించి భయం భయంగా ఎక్కడ మళ్ళీ తెగిపోతుందో అని కదిలాను.

ఢిల్లీ నుంచి మేము చేరాల్సింది హిమాచల్ ప్రదేశ్, కులూ లో ఉన్న “కసోల్” అనే కుగ్రామం. దానికి నేరుగా బస్సు లేకపోవడంతో “భుంతర్” అనే ప్రదేశం చేరి అక్కడ నుంచి ఇంకో లోకల్ బస్సెక్కి కసోల్ చేరాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఢిల్లీ కానీ హిమాచల్ కానీ నార్త్ లో మా ప్రయాణంలో చుట్టిన రాష్ట్రాలన్నిటిలోనూ బస్ సర్వీసులు మాత్రం మహా చెత్తగా ఉన్నాయి. ఇక ప్రైవేటు బస్ ఆపరేటర్లందరూ విపరీతంగా ఓవర్ ప్రైస్డ్.

బస్ ప్రయాణం రాత్రి పూట. అదేదో స్లీపర్ కోచ్ అన్నాడు. అటకెక్కించ్చాడు మమ్మల్ని. పడుకోడానికి బానే ఉంది. అంత పెద్ద ప్రయాణం చేసిన తరువాత చల్లగాలి ముఖానికి తగులుతుంటే హాయిగా నిద్ర పట్టింది.

మామూలుగా తొమ్మిది, తొమ్మిదిన్నర కి మధ్యలో నిద్ర లేచే నాకు ఆ మరుసటి రోజు ఎందుకో మరి ఉదయం ఐదున్నరకే మెలకువొచ్చింది. కొద్దిగా చలేస్తుంది. అలా కాస్త బద్దకంగా ఒళ్ళు విరుచుకుని జారగిలబడి కిటికీలో నుంచి బయటకు చూడగానే వావ్… అనిపించింది. బస్సు వెళుతున్న దారిలో లోయలు, ఆ పొద్దున్న అప్పుడే బయటకొస్తున్న సూర్యుడు ఎంత అద్భుతమయిన దృశ్యాల్ని చూపించాయో.

అసలు అవి చూస్తూ చూస్తూనే సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఎప్పుడు నిద్ర లేచాడో‌గానీ హర్ష కూడా నాలాగే కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. ఇద్దరమూ ఏమీ మాట్లాడుకోలేదు చాలా సేపటి వరకూ. అలా చూస్తూనే ఉన్నాము. ఆఖరికి ఓ గంట సేపటి తరవాతేమో ఇద్దరమూ ఓ సారి ముఖ ముఖాలు చూసుకుని ఓ చిరునవ్వు నవ్వుకుని ఈ ప్రదేశమే ఇలాగుంటే మనం వెళ్ళబోయే ప్రదేశాలు ఇంకెంత బాగుంటాయో అనుకున్నాము.

డ్రైవరుకి చెప్పకపోతే ఆపడేమో అని నెమ్మదిగా ఆ పక్కకి వెళుతుంటే ఆ వైపున ఇంకో అటక మీదున్న మాలాంటి స్నేహితులే అన్నారు లేదు ఆపుతారు, మేమూ అక్కడికే వెళుతున్నాము. ఆ ట్రెక్కుకే అన్నారు. భలే సంతోషమేసింది.
వారితో ముచ్చట్లు మొదలెట్టాము. వారిద్దరూ ముంబై వాసులని తెలిసింది. ఒకరు హర్షద్ (మెకానికల్ ఇంజినీరయిన ఇతను తన హాబీ/బిజినెస్ గా చెక్క రిస్టు వాచీలు తయారు చేస్తాడు), ఇంకొకరు యోగేష్ (ఇతనొక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్.)

అందరమూ అలా మాట్లాడుకుంటూనే భుంతర్ చేరుకున్నాము. ఇంకొందరు కూడా అక్కడ తగిలారు మాకు. జీపు మాట్లాడుకుందామా అని చూస్తున్న మాకు అప్పుడే వచ్చిన బస్సు కనిపించింది. పద పదమని అందరమూ ఆ బస్సెక్కేసాము. ఆ బస్సు ప్రయాణం కూడా బాగుంది. లోకల్ బస్ సర్వీసు అది. పొద్దున్నే పనికెళ్ళే వారు, స్కూలుకెళ్ళే పిల్లలు, ఒకరిద్దరు అందమైన యువతులు ఆ బస్సులో కనిపించారు. మా వంక కొద్దిగా వింతగా చూస్తున్నారు.

ఎదురుగా వచ్చే జీపులు, బస్సులని తప్పించుకుని ఆ సన్నని కొండ దారిలో నేర్పుగా నడుపుతున్నాడు డ్రైవరు. మా బాక్‌పాక్ లను ఒళ్ళో పెట్టుకుని ఆ లోయలను చూస్తూ మళ్ళీ ఇందాకటి స్నేహితులతో మాటల్లో పడ్డాము. అందులో హర్షద్ ఇప్పటికే యూత్ హాస్టల్స్ కి సంబంధించిన అన్ని ట్రెక్కులూ పూర్తి చేసాడనీ, ఇదే ఆఖరనీ, ప్రతీ ఏడాదీ ఒక ట్రెక్కు చెయ్యడం అతని అలవాటనీ తెలిసింది.

అతని స్నేహితుడు యోగేష్ ఫోటొగ్రఫీ వృత్తనీ, ఇంకొన్ని రోజులలో ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడనీ, ఈ ట్రెక్‌లో తీసిన ఫోటోలను కూడా ఉంచుతాడనీ, అతను కూడా ఇంతకు ముందు ఒక రెండు ట్రెక్కులు చేసాడనీ కూడా తెలిసింది.

ఊ… మంచి ఇంటరెస్టింగ్ జనాలు దొరికారని అనుకున్నాము నేనూ, హర్షా.

అలా మొత్తానికి “కసోల్” చేరి, మా బేస్ కాంపుకి చేరుకున్నాము. అక్కడికెళ్ళగానే మాకు మొదట కనిపించిన దృశ్యాలు ఇవి. ఓ రెండు క్లిక్కులు క్లిక్కి రిపోర్టింగు చెయ్యవలసిన టెంటుకి చేరాము.

అక్కడ మాకో పింకు స్లిప్పిచ్చారు. అది మా ఐడెంటిటీ అన్నమాట. మేము కాంపు నుంచి బయటికెళ్ళాలంటే దానిని వెనక్కిచ్చి వెళ్ళాలి, తిరిగొచ్చినప్పుడు తీసుకోవాలి. అలా మమ్మల్ని ట్రాక్ చేస్తారన్నమాట.

ఇంతలో మా వాడు హర్ష ఒక బాంబు పేల్చాడు. నా బాక్‌పాక్ తెగడంతో దాంట్లో నుంచి కొంత సామానుని ఒక ప్లాస్టిక్ కవరులోకి మార్చాను. ముఖ్యంగా తినడానికి తెచ్చుకున్న సామానులు. ఓ అరకేజీ ఖర్జూరం, జీడిపప్పు, ఓ యాభై ఫైవ్ స్టారులు మొదలయినవన్నమాట 🙂
మా వాడు బస్సు దిగుతూ అది కాస్తా దాంట్లో వదిలేసాడుట.

ఇద్దరికీ చాలా సేపు బాధగా అనిపించింది. నేను అన్ని డబ్బులు పోసి కొన్నవీ, ఆఖరికి ట్రెక్కులో పనికి రాకుండా పోయాయనీ. సరే పోయినదానికి విచారించడమెందుకని అక్కడితో వదిలేసాము. కొంతలో కొంత నయమేమిటంటే అవసరమయిన సామానులేవీ అందులో పెట్టలేదు.

ఇక మేము అక్కడ రిపోర్టు చేసిన తరువాత మాకు ఒక టెంటు ఇవ్వడం జరిగింది. వీటి కథా కమామీషేమిటంటే బేస్ కాంపులో రిపోర్టు చేసిన నాటి నుంచీ మన బస అంతా టెంట్లలోనే. ఒక్కో టెంటులోనూ పది-పదిహేను దాకా జనాలుంటారు. అందరికీ ఒక స్లీపింగు బాగు, రగ్గు ఇవ్వబడతాయి.

పదిహేను మందీ టెంటులో చేరితే అటూ ఇటూ తిరగడానికి స్థలముండదు. మాకివ్వబడిన టెంటులో అప్పటికి ఇద్దరు జనాలు మాత్రమే ఉన్నారు. ఒకరు “అయ్యరు”, ఇంకొకరు అతని “పుత్తరు” (కొడుకు). వీరి మహత్యం ముందు ముందు ట్రావెలాగులలో తెలుస్తుంది…