ఉబుంటు ఇంట్రెపిడ్ ఐబెక్స్ ..

.మొన్న సెప్టెంబరు ౩౦ న ఉబుంటు ఇంకొక సరికొత్త నవీకరణ (8.10) విడుదలయింది. (ఇంట్రెపిడ్ ఐబెక్స్, ఇంకో చిత్రవిచిత్రమయిన పేరు 🙂

* ఉబుంటు మీద ఇంతకు ముందు నా టపాలు ఇక్కడ చూడవచ్చు.

ఇది LTS (Long Term Support) రిలీజు కాదు. కాకపోతే కొన్ని చక్కని మార్పులు చేసారు ఇందులో.

మీరు ఇప్పటికే ఉబుంటు 8.04, హార్డీ హెరాన్ గనక ఉపయోగిస్తున్నట్టయితే ఈ రిలీజుకి నవీకరించడానికి ఈ కింది కమాండుని ఉపయోగించండి.

sudo apt-get dist-upgrade

౧. గ్నోమ్ 2.24: ఉబుంటు ఇంట్రెపిడ్‌లో గ్నోమ్‌ కొత్త నవీకరణ 2.24 ని జతచేసారు.

౨. గెస్ట్ సెషన్: మీరు మీ కంప్యూటరుని వాడుతున్నారు. మీ స్నేహితుడో, మీ ఇంట్లో వాళ్ళో కాసేపు కాసేపు మీ కంప్యూటరుని వాడాలనుకున్నారు. కానీ మీ సిస్టంని వారికి అప్పగించడానికి మీకు ఇష్టముండకపోవచ్చు. మీ ప్రైవేటు ఫైళ్ళు ఎవరయినా చూస్తారేమోనని లేదా ఏదయినా ఫైళ్ళు పొరపాటున తొలగిస్తారని భయముండవచ్చు.
అలాంటి పరిస్థితులలో ఉపయోగించడానికే ఈ కొత్త వర్షనులో గెస్ట్ అకౌంటుని జతచేసారు. మీరు ఎంచగ్గా ఆ అకౌంటుకి స్విచ్ చేసి మీ స్నేహితులకి సిస్టం అప్పగించవచ్చు. ఆ అకౌంటు ద్వారా సిస్టంలో ఏ మార్పులూ చెయ్యలేరు. ఏదయినా చేసినా అవి /tmp ఫోల్డరులోకి వెళతాయి కాబట్టి లాగౌట్ అయిన వెంటనే అన్నీ మాయం.

౩. ప్రైవేటు ఫోల్డరు: మీ సిస్టంలో ఎవరూ చూడదనుకున్న ఫైళ్ళు ఉన్నాయనుకోండి. అది మీ అకౌంటుకి తప్పితే ఎవరూ ఆక్సెస్ చెయ్యకూడదనుకుంటే ఆ సదుపాయం ఈ వర్షనులో ఉంది.
ఈ కింది కమాండులను మీ సిస్టంలో ఇవ్వండి

sudo apt-get install ecryptfs-utils
ecryptfs-setup-private

ఇప్పుడు మీ హోమ్‌ ఫోల్డరు (/home/) లో “ప్రైవేట్ (Private)” అని ఒక ఫోల్డరు కనబడుతుంది. అందులో దాచిన ఏ ఫైలు అయినా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. అది మీ అకౌంటుకి తప్ప ఎవరికీ ఆక్సెస్ అవవు. బాగుంది కదూ ?

౪. యూఎస్‌బీ డిస్క్: ఇప్పుడు మీరు మీ ఉబుంటు ఇన్‌స్టాలేషనుని మీరు ఇప్పుడు మీతో పాటూ ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకు వెళ్ళవచ్చు. ఇది తయారు చెయ్యడానికి ఒక ఉపకరణం ఇంట్రెపిడ్‌లో జత చేసారు.
కాకపోతే దీనికోసం మీకు ఉబుంటు ఇంట్రెపిడ్ iso కానీ సీడీ కానీ అందుబాటులో ఉండాలి. ఈ ఉపకరణం మీ ఉబుంటుని యూఎస్‌బీ మీదకి కాపీ చేస్తుంది. మీ సెట్టింగులు గట్రా కూడా యూఎస్‌బీ మీదే ఉంటాయి.

౫. నాటిలస్ లో ఇప్పుడు టాబులు: గ్నోమ్‌ నాటిలస్ ఫైలు మేనేజరులో ఇంతకు ముందు వరకూ టాబులు లేవు. ఈ రిలీజులో ఆ ఫీచరు ఉంది.

౬. కేడీయీ 4.1: కేడీయీ వర్షనయిన కుబుంటులో ఈ సారి కేడీయీ 3.5 నుంచి 4.1 కి నవీకరించబడినది. ఇది ఒక పెద్ద మార్పు. ఎందుకంటే కేడీయీ 4 ఇంతకు ముందు కేడీయీ వర్షనులకంటే సమూలంగా మార్పు చెందింది. దాని గురించి నా ఇంతకు ముందు టపా చూడవచ్చు.

ఇవి కాక ఇతర ఉపకరణాలన్నీ నవీకరించబడినవి.

గత కొంత కాలంగా ఇంట్రెపిడ్ ఆల్ఫా వాడుతున్న నా అనుభవాలు:

౧. కేడీయీ 4.1 నాకు అంతగా నచ్చలేదు. సంపూర్ణంగా స్టేబుల్ అయిన పాడక్టు కాదని నా అభిప్రాయం. అవడానికి చక్కని ఐ కాండీ అయిన ఈ వర్షను ఇంతకు ముందు వర్షనయిన కేడీయీ 3.5 అంత స్టేబుల్ గా లేదు.
ఇంకా చెప్పాలంటే గత కొంత కాలంగా నేను కేడీయీ లోకి లాగిన్ అవలేకపోయాను. లాగిన్ అవగానే ఫ్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది నాకు పెద్ద ఫ్లాప్. కానీ మిగతా వారికి సరిగానే పని చేస్తున్నట్టుంది.

౨. ఎవల్యూషన్ యొక్క సరికొత్త నవీకరణలో సమస్యలున్నాయి. OWA https యూఆర్‌ఎల్ తో ఇది సరిగా పని చెయ్యదు. కాబట్టి మీ కంపెనీ కనుక మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్ వాడుతుంటే మీరు ఐమాప్ ప్రోటోకాలు ఉపయోగించాలి లేదా మీ ఎక్చేంజ్ సర్వరు http ప్రోటోకాల్‌కి మద్దతునివ్వాలి.

౩. ఎక్స్ విండోస్ ఈ రిలీజులో చాలా నిలకడగా ఉంది. డ్యూవల్ మానిటర్ సెటప్ లాంటివి సులభంగా చెయ్యవచ్చు.

౪. నెట్‌వర్క్ మేనేజరు చాలా చక్కగా పని చేస్తుంది ఈ రిలీజులో. మీ ఇంటర్ఫేసులన్నిటినీ ఇది అద్భుతంగా నిర్వహిస్తుంది. వైర్‌లెస్ సమస్యలు దాదాపుగా తీరినట్టే.

చివరగా నా ఇంట్రెపిడ్ గ్నోమ్‌ డెస్కుటాపు చిత్రంతో ముగిస్తాను 🙂

Loading image

Click anywhere to cancel

Image unavailable

విండోసు ఉపకరణాలకి లినక్సు ప్రత్యామ్నాయాలు …

లినక్సు గురించీ, ఉబుంటు గురించీ నా ఇంతకు ముందు టపాలలో కొన్ని సార్లు చెప్పాను.

ఎంత కాదనుకున్నా ఒప్పుకోవాల్సిన విషయమేమిటంటే విండోసు, మాక్ లాంటి కమర్షియల్ ఆపరేటింగు సిస్టమ్‌ లనే జనాలు ఎక్కువగా వాడతారు.

జనాలు ఎందుకు లినక్సు ఉపయోగించరు అని ప్రశ్నించుకుంటే మామూలుగా వచ్చే సమాధానాలు చాలా వరకూ అపోహలనే అనిపిస్తుంది. ఒకప్పుడు వాడుకరులకి అనుకూలంగా కాక గీకులు మాత్రమే ఉపయోగించే విధంగా లినక్సు ఉండేది. అది నిజం.
ఏ పని చెయ్యాలన్నా కమాండు లైను నుంచి చెయ్యాల్సి వచ్చేది. ఆ తరువాత దానికి జోడింపులు వచ్చి ఎక్స్ విండో సిస్టం వచ్చినా ఆ ముద్ర మాత్రం వదలలేదు.

అందుకని జనాలకు మామూలుగా ఉండే కొన్ని అపోహలను దూరం చేసి, లినక్సులో రోజువారీగా వాడుకోడానికి కావలసిన ఉపకరణాలు కొన్నింటి గురించి ఇక్కడ చెప్పటానికి ప్రయత్నిస్తాను.

౧. చూడడానికి బాగుండాలి:

విండోసు వాడిన వారందరికీ ముఖ్యంగా నచ్చే విషయం అది చూడడానికి బాగుంటుంది. కంటికింపుగా ఉంటుంది. నాకయితే “విండోస్ ఎక్స్పీ” ముందు వరకూ విండోసు నచ్చేది కాదు. ఎక్స్పీ మాత్రం నన్ను చూపులతో ఆకట్టుకుంది. విస్టా ఏరో ఎఫెక్టులతో దానిని ఇంకో ముందంజ ?? వేయించినా దానిని ఉపయోగించాలంటే ఒక జీబీ పైన రామ్‌ అవసరమవుతుంది.

మరి లినక్సు చూడడానికి బాగుంటుందా ?

దీనికి సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే కుదరదు. ఎందుకంటే ఇది అభిరుచికి సంబంధించినది. (నాకు విస్టా కంటే ఎక్స్పీ నే బాగుందనిపించింది.)
కాకపోతే ఇక్కడ కొంత వివరిస్తాను. కొన్ని తెర పట్టులు చూపిస్తాను. మీరే నిర్ణయించుకోవచ్చు.

స్థూలంగా చూస్తే లినక్సులో ఉండే ముఖ్యమయిన విండో సిస్టములు రెండు. గ్నోమ్‌, కేడీయీ (ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ ఎక్కువ మంది వాడేది ఇవే). సింపుల్ గా, పని చేసే వ్యవస్థ కావాలనుకునే వారు గ్నోమ్‌ వాడతారు. మంచి చాక్లెటీ లుక్సూ, చూడడానికి బాగుండాలి అనుకునే వారు కేడీయీ వాడతారు.

గ్నోమ్‌ (ఉబుంటు మీద)

కేడీయీ (కుబుంటు మీద)

నా మటుకు నేను ఎక్కువగా కేడీయీ వాడతాను. (మీరూహించినందుకు కాదు 😉 )

ఇంకో విషయమేమిటంటే లినక్సుని మనం అద్భుతంగా కస్టమైజు చేసుకోవచ్చు.

ఉదా: గ్నోమ్‌ ని మాక్ లాగా ఇలా మార్చుకున్నాను నేను.

వీటన్నిటికీ మించి కాంపిజ్ ఎఫెక్ట్లు చేతనం చేసిన ఈ తెరపట్టులు చూడండి.

మీకు ఇంకా లినక్సు చూడడానికి బాగుండదనే అనిపిస్తుందా ???

౨. ఆఫీసు ఉపకరణాలు:

లినక్సుకి మారాలనుకున్న వారికి ఇంకో పెద్ద సమస్య ఆఫీసు ఉపకరణాలు. అంటే వర్డు, ఎక్సెలు, పవర్‌పాయింటు లాంటివి.

దీనికి లినక్సు ప్రత్యామ్నాయం “ఓపెన్ ఆఫీస్“.






మొత్తం కావలసిన ఉపకరణాలు అన్నీ ఇందులో ఉంటాయి. వర్డు ప్రాసెసరు, స్ప్రెడ్ షీట్, ప్రెజెంటేషను వగయిరా అన్నీను.
ఇంకొక విషయమేమిటంటే మైక్రోసాఫ్టు ఆఫీసు అన్ని అప్లికేషన్లతోనూ ఇది కంపాటిబుల్. అంటే మీ .doc, .xls, .ppt వంటి వాటినన్నిటినీ ఓపెన్ ఆఫీసులో తెరవవచ్చు, మార్చవచ్చు, కొత్తవి సృష్టించవచ్చు.

౩. మెయిలు

మామూలుగా జనాలు తమ కార్పొరేట్లలో “మైక్రోసాఫ్టు ఎక్స్చేంజు” వాడతారు. దానికి క్లయింటుగా “అవుట్‌లుక్” వాడతారు. ఎందుకంటే వారు ప్రొప్రయిటరీ ప్రోటోకాల్ వాడతారు.

దానికి లినక్సులో ప్రత్యామ్నాయం “ఎవల్యూషన్“.

ఇది అన్ని రకాల ప్రోటోకాల్స్ తో (పాప్, ఐమాప్ వగయిరా…) పాటు “ఎక్స్చేంజు” ప్రోటోకాల్ ని కూడా సపోర్టు చేస్తుంది. దీనితో మీ కాలెండరు కూడా పని చేస్తుంది. మీటింగులు గట్రా అన్నీ దీని ద్వారా పని చేస్తాయి.

అలాగే మీకు తెలిసిన “థండర్‌బర్డ్” ఎలాగూ ఉండనే ఉంది.

౪. మల్టీమీడియా:

నాకయితే పని చేస్తున్నంత సేపూ పాటలు చెవిలో మోగాల్సిందే. అలాంటప్పుడు మంచి సంగీతం పాడే ప్లేయరు చాలా అవసరం.
అలాగే రోజూ ఒక సినిమా చూడాల్సిందే. అందుకని అన్ని రకాల ఫార్మాట్ల సినిమాలనూ చక్కగా ప్లే చేసే ప్లేయరు కూడా చాలా అవసరం.

విండోసులో అయితే విన్ ఆంప్, విండోసు మీడియా ప్లేయరు, వీఎల్సీ లాంటివి ఉంటాయి. మరి వాటికి లినక్సు ప్రత్యామ్నాయాలో ?

పాటలకి “అమరాక్” అనే ఒక అద్భుతమయిన ప్లేయరు ఉంది. ఇది ఆల్ ఇన్ వన్ ప్లేయరు. దాదాపు అన్ని రకాల ఫార్మాట్లనూ ప్లే చేస్తుంది. నాకయితే ఇది లేనిదే రోజు గడవదు. (ఇది పాటలు పాడుతుంది. స్ట్రీమ్‌ లను అర్థం చేసుకుంటుంది. ఐపాడ్, సాన్‌డిస్క్ లాంటి మీ మ్యూజిక్ ప్లేయర్లను గుర్తించగలుగుతుంది. వాటిని సింక్ చేయగలుగుతుంది.)

ఇంకా రిథమ్‌ బాక్స్, టోటెమ్‌, కెఫీన్ లాంటి ఎన్నో ప్లేయర్లు ఉపలబ్ధం.

అలాగే సినిమాలు ప్లే చెయ్యడానికి నాకు అన్నిటికన్నా నచ్చేది “క్సైన్“. ఇది ఒక అద్భుతమయిన ప్లేయరు. దాదాపు అన్ని రకాల ఫార్మాట్లనూ ప్లే చేస్తుంది. చక్కని క్వాలిటీ చిత్రం అందిస్తుంది. ఇంకో సంగతేమిటంటే‌ మనకెంతో ఇష్టమయిన వీఎల్సీ ప్లేయరు లినక్సులో కూడా లభ్యం.

౫. ఇంటర్నెట్ మెసెంజరు:

విండోసులో మనం ఎక్కువగా యాహూ మెసెంజరు, గూగుల్ టాక్, ఎమెసెన్ మెసెంజరు వాడతాము. వాటన్నిటికీ ఒక్కో మెసెంజరు తెరిచి ఉంచాలి, లేదా “పిడ్జిన్” లాంటి ఓపెన్ సోర్స్ క్లయింటు వాడి అన్నిటికీ అనుసంధానం కావచ్చు.

పిడ్జిన్ మొదటగా లినక్సు కోసం రూపొందించిందే. అద్భుతమయిన క్లయింటు ఇది. యాహూ, గూగుల్ టాక్, ఏఓఎల్, ఎమెసెన్, జాబర్ వంటి ఎన్నో ప్రోటోకాల్స్ ని ఇది సమర్థిస్తుంది.

ఇంకా “కోపీటె” లాంటి ఇతర క్లయింటులు కూడా ఉన్నాయి.

౬. ఇమేజింగు:

ఎక్కువగా విండోసు మీద జనాలు ఫోటోలకీ, వాటితో పని చేయ్యడానికీ ఫోటోషాపు, పెయింట్.నెట్, కోరెల్ డ్రా లాంటివి వాడతారు.

దానికి లినక్సులో ప్రత్యామ్నాయాలు గింప్, ఇంక్‌స్కేప్ వాడవచ్చు.

౭. విహరిణి:

లినక్సు మీద ఎన్నో విహరిణులు లభ్యం. మన మంట నక్క లినక్సు మీద ఉంది. అలాగే ఓపెరా, కాంక్వరర్, లింక్స్ లాంటి ఎన్నో విహరిణులు లినక్సు మీద లభ్యం.

తెలుగులో రాయడం:

తెలుగులో రాయడానికి విండోసులో బరహ, అక్షరమాల లేదా ఇన్‌స్క్రిప్టు వాడతాము.

దానికి బదులుగా లినక్సులో స్కిమ్‌ లేదా మన భాష కీబోర్డు వాడవచ్చు.

ఇవన్నీ మనం రోజువారీ ఉపయోగించే ఉపకరణాలు. ఇవి కాక మనకు కావలసిన పనులన్నిటికీ ఉపకరణాలు లినక్సులో లభ్యం.

మీకు ఇంకో వార్త. ఇప్పటి వరకూ లినక్సులో మాత్రమే లభ్యమయిన కేడీయీని ఇక పైన విండోసు మీద కూడా పరిగెత్తించవచ్చు. QT అనే క్రాస్ ప్లాట్ఫాం మీద రూపొందించడం వల్ల కేడీయీని తేలికగా విండోసు మీదకి కూడా పోర్టు చెయ్యడం కుదురుతుంది. ఇప్పటికే దీని బీటా వర్షన్లు కూడా లభ్యం. అంటే ఇక పైన మీకు ఇష్టమయిన “అమరాక్” లాంటి ఉపకరణాలు విండోసు మీద కూడా లభ్యమవుతాయి అన్నమాట.

మరి ఇంత పరిపూర్ణమయిన ఆపరేటింగ్ సిస్టం ని వాడకుండా ఎలా ఉండగలరు ? 🙂

ఇది చూడండి: ఈ వ్యాసంలో ఉపయోగించిన చిత్రాలు అన్నీ నావి కావు. కొన్ని ఆయా సైట్ల నుంచి తీసుకోవడం జరిగింది. వాటిపై హక్కులన్నీ వారివే.

కుబుంటు హార్డీ హెరాన్ …

ఉబుంటు/కుబుంటు మరో సరికొత్త రిలీజుతో ఆకట్టుకుంది. సరికొత్తగా విడుదలయిన రిలీజు పేరు “హార్డీ హెరాన్“.

ఉబుంటు/కుబుంటు గురించి తెలియని వారికి, ఇది ఒక లినక్సు డిస్ట్రిబ్యూషను. డెబియన్ డిస్ట్రిబ్యూషను నుంచి వచ్చినది. ప్రతీ ఆరు నెలల రిలీజుతో “యూజబిలిటీ” మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూ దూసుకుపోయే ఒక మంచి డిస్ట్రిబ్యూషను ఇది.
గత కొద్ది ఏళ్ళుగా డేస్క్‌టాప్ పైన విండోసుకి బలమయిన ఉచిత ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఆపరేటింగ్ సిస్టం ఇది.

అన్నట్టు ఇది ఒక ఎల్టీఎస్ (Long Term Support) రిలీజు. అంటే ఒక మూడేళ్ళ వరకూ సపోర్టు ఉండే రిలీజన్నమాట. అదీ ఉబుంటు సమస్యలను ఎంత తొందరగా పరిష్కరిస్తుందో వాడిన వారందరికీ తెలిసే ఉంటుంది.

ఈ రిలీజుతో పాటు ఎన్నో చక్కని ఫీచర్లు వచ్చాయి. కొన్ని ఈ కింద.

అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది

వుబీ ఇంస్టాలర్: ఎందుకంటారా ? దీని ద్వారా ఇప్పుడు విండోసులోనే ఉబుంటు ని స్థాపించుకోవచ్చు. అంటే మీకు మరో పార్టీషను లేకపోయినా ఫరవాలేదు. మీరు చెయ్యవలసిందల్లా ఈ ఉబుంటు/కుబుంటు సీడీ దొరకబుచ్చుకుని విండోసులో తెరవండి. మీకు ఒక చిన్న విజర్డ్ ని చూపిస్తుంది. దానినుపయోగించి ఉబుంటుని విండోసులో ఒక అప్లికేషనులాగా ఇంస్టాల్ చేసుకోవచ్చు.

ఈ కింది బొమ్మ చూడండి.

ఉబుంటు కి ఎంత స్థలం కేటాయించాలనుకుంటున్నారో చెప్పండి. అంతే. ఒక సారి రీబూట్ అవగానే మీ సిస్టమ్‌ లో ఉబుంటు స్థాపితమయిపోతుంది.
కంప్యూటరు బూటవుతున్నప్పుడు ఉబుంటు/కుబుంటు ఎంచుకోండి. ఝామ్మని వాడెయ్యండి.

ఇప్పుడర్థమయిందా ? నాకెందుకు నచ్చిందో. విండోసు వాడుకదారులని లినక్సుకి మరల్చడంలో ఇదెంతో సహాయపడుతుందని నా నమ్మకం. అంత రూఢిగా ఎలా చెబుతున్నానంటారా ? ఇప్పటికే నలుగురిని ఇలా మార్చా కాబట్టి 🙂 (అందులో మన రానారె ఒక్కడు)

ఇంకా ఈ రిలీజులో కేడీయీ ౪ ఇంటిగ్రేట్ చెయ్యబడి ఉంది. అదేంటంటారా ? నా ఇంతకు ముందు టపా ఓ సారి చదవండి.

కేడీయీ ౪ సరికొత్త రూపం. కొత్త ప్రయోగం. ఇప్పుడిప్పుడే విడుదలవుతుంది గనుక రఫ్ గా ఉంటుంది. కానీ ఇప్పుడే ఇలా ఉంటే రేప్పొద్దున్న ఎంత ఎక్సైటింగుగా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి.

విడ్జెట్లు, ఎఫెక్ట్లతో తప్పకుండా ఆకట్టుకుంటుంది.

ఇకపోతే కాంపిజ్ కి చెందిన డెస్క్‌టాప్ ఎఫెక్ట్లు ఇప్పుడు కేడీయీలో సులభంగా ఎంచుకోవచ్చు.

లినక్సు లో ఇంటర్ఫేసు కి హంగులు లేవని అనే వారికి ఇవి చూసిన తరువాత దిమ్మతిరుగుతుంది. కాంపిజ్ ద్వారా ఎలాంటి ఎఫెక్ట్లు మీకు లభ్యమవుతాయో మచ్చుకు ఈ లంకెలో ఉన్న తెరచాపలను చూడండి.

ఇవి కొన్ని ఫీచర్లూ, మార్పులూ మాత్రమే. ఉబుంటు ని స్థిర పరచడానికి, ముందు ముందు చక్కని రిలీజులు చెయ్యడానికి మన కంటికి కనిపించని ఎంతో పని ఈ రిలీజు మీద జరిగింది.

పూర్తి ఫీచర్ల గురించి తెలుసుకోవాలంటే ఈ లంకె చూడండి.

అన్నట్టు మీకు తెలియకపోతే ఉబుంటు/కుబుంటు సీడీలు మీకు ఉచితంగా పంపిణీ చెయ్యబడతాయి. ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడకెళ్ళి అడగొచ్చు. అందరికీ పంచగలిగినన్ని సీడీలు తెప్పించుకుని అందరికీ ఇవ్వవచ్చు. అంత వరకూ ఆగలేకపోతే దీనిని ప్రయత్నించి చూడడానికి మీకయ్యే ఖర్చల్లా ఒక్క సీడీ మాత్రమే. ఇక్కడ నుంచి ఐఎస్‌ఓ ని తెచ్చుకుని సీడీ తయారు చేసుకోండి. అంతే.

కుబుంటు ని ఎలా వాడాలో కొత్తగా వాడేవారికి నా ఈ టపా ఉపయోగపడవచ్చు.

మరోసారి జై బోలో కుబుంటు కీ !

విండోసు లాపుటాపు పై లినక్సు… నా తంటాలు…

ఈ రోజు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను.

ఎట్టకేలకు నా లాపుటాపు ని కూడా కుబుంటు తో లోడు చేసాను. దానికి ఇన్నాళ్ళు తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి.
మొదటిది మా కంపెనీ వారు లాపుటాపుల మీద లినక్సు ని సపోర్టు చెయ్యరు. వారు చెయ్యకపోయినా ఫరవాలేదు కానీ కొన్ని అప్లికేషన్ల కోసం విండోస్ కావాల్సిందే. ఎలాంటివంటే “ఐపీ కమ్యూనికేటరు” వంటివి. కాబట్టి రెండూ ఉండేలా “డ్యూవల్ బూట్” చెయ్యాలి.

ఈ క్రమంలో నే పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. ఎట్టకేలకు సాధ్యమయింది.

ఇది సాధించడానికి నే చేసినవి ఈ క్రమంలో:

నా లాపుటాపు లో ఒకే పార్టీషనుంది. లినక్సు ఇన్స్టాలు చెయ్యాలంటే ఇంకో పార్టీషను కావాలి. కానీ ఫార్మాట్ చేస్తే ఇంతవరకూ విండోస్ లో ఉన్న డాటా, ఇన్స్టాలు చేసిన అప్లికేషన్లూ పోతాయి. అందుకని రీపార్టీషన్ చెయ్యాలి. కానీ డాటా లాస్ కాకుండా. FAT, FAT32 వంటి ఫైల్ సిస్టంలైతే పెద్ద కష్టం కాదు కానీ NTFS కి సపోర్టు తక్కువే.
మొదట కుబుంటు “లైవ్ సీడీ” లో ఉన్న QTParted టూల్ ని ఉపయోగించి రీసైజు చెయ్యడానికి ప్రయత్నించాను. కానీ ఫెయిలయింది. ఎందుకంటే డిస్కు ని నేను దాదాపు ఎన్నో నెలలుగా “డీఫ్రాగ్” చెయ్యలేదు.

* మన హార్డు డిస్కు ఉపయోగించిన కొద్దీ అందులో స్టోర్ చేసే ఫైళ్ళు చెల్లా చెదురుగా పడుంటాయి. ఎందుకంటే కొన్నాళ్ళుగా మనం ఇన్స్టాలు, అనిన్స్టాలు, క్రియేటు, డిలీటు వంటివి మన ఫైళ్ళతో చేస్తుంటాము. కాబట్టి ఫైళ్ళన్నీ హార్డు డికులో అక్కడా ఇక్కడా ఉంటాయి. దానినే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. దానిని తొలగించే విధానాన్ని డీఫ్రాగ్మెంటేషన్ అంటారు.

విండోస్ లో డీఫ్రాగ్మెంటు చెయ్యడానికి యుటిలిటీలుంటాయి. విండోస్ తో వచ్చే యుటిలిటీ అంత సమర్థవంతంగా డీఫ్రాగ్ చెయ్యదు. తర్డు పార్టీ యూటిలిటీలుంటాయి ఉదా: jkdefrag, Diskeeper వంటివి.

నేను jkdefrag ఉపయోగించాను. డీఫ్రాగ్ అయితే సమర్థవంతంగా అయింది కానీ అయినా పనిచెయ్యలేదు. ఎందుకంటే MBR, Pagefile వంటి వాటిని అది కూడా డీఫ్రాగ్ చెయ్యలేదు కనక. చివరికి Diskeeper అనే సాఫ్టువేరు ఉపయోగించాను. ఇది బూట్ టైం లోనే డీఫ్రాగ్ చేస్తుంది కాబట్టి వాటిని కూడా డీఫ్రాగ్ చెయ్యగలిగింది.

హమ్మయ్య… ఆఖరికి ఎలాగయితే QTParted ఉపయోగించి పార్టీషను ని రీసైజు చెయ్యగలిగాను. ఒక పది జీబీ స్పేసు తో వేరే పార్టీషను ని సృష్టించాను.

తర్వాతదంతా ఈజీనే. కుబుంటు ఇన్స్టాల్ చెయ్యడానికి అక్షరాలా పదిహేను నిముషాలు పట్టింది. తర్వాత అప్డేట్లు ఒక పది నిముషాలు. కావలసిన ఫైర్ఫాక్సు, థండర్బర్డు మొదలయినవి ఇంకో అయిదు నిముషాలు.

మొట్ట మొదట నాకు కావాల్సింది విండోసు లోని డాటా. అది ఒక్క కమాండు దూరం అంతే. ఆ పార్టీషనుని “మౌంటు” చెయ్యగానే డాటా అంతా లభ్యం. ఇంతకు ముందయితే NTFS కి రీడ్ ఓన్లీ సపోర్టు ఉండేది, కానీ ఇప్పుడు “ntfs-3g” డ్రైవరుని కుబుంటు లో ఇంటిగ్రేటు చెయ్యడంతో రీడ్ రైటు సపోర్టు వచ్చేసింది. అంటే మీ విండోసు డ్రైవు ని కూడా మౌంటు చేసి ఆ స్పేసు ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. (ఇందులో ఉన్న ఒకే చిక్కేమిటంటే ntfs-3g డ్రైవరు విండోసు హైబర్నేటు అయి ఉంటే పని చెయ్యదు.)

ఎలాగూ నాకు కావలసిన ఆఫీసు సాఫ్టువేరు “ఓపెన్ ఆఫీసు” ఇన్స్టాల్ అయే ఉంది. కాబట్టి ఇక కావలసింది మైక్రోసాఫ్టు ఎక్ష్చేంజ్ సర్వరు కి కనెక్టు కావడానికి మెయిల్ క్లైంటు. అవుట్లుక్ కి దగ్గరగా వచ్చే క్లైంటు లినక్సు లో “ఎవల్యూషన్“. అది కాలెండరింగు కూడా సపోర్టు చేస్తుంది.

తర్వాతది మెసెంజరు. పిడ్జిన్ (ఇంతకు ముందు గెయిమ్) ని మించింది ఏది ?

ఇంక నాకు తలెత్తిన సమస్య ఆఫీసు వైరులెస్సు కి కనెక్టు కావడం. మా వైరులెస్సు నెట్వర్కు “EAP-FAST” ఆథెంటికేషను వాడుతుంది. కుబుంటు లో మామూలు అనాథెంటికేటెడ్, లేదా WEP ఆథెంటికేషను సపోర్టు ఉంది కానీ EAP-FAST కి సపోర్టు లేదు. wpasupplicant పాకేజీ ని openssl సపోర్టు తో కంపైల్ చేస్తే పని చేస్తుంది. ఆ పాకేజీని మార్చేంత సీను నాకు లేకపోవడంతో కంపెనీలో ఆ సీనున్న వారితో చేయించి నడపగానే వైరులెస్సు తో కనెక్టయిపోయింది.
(చూసారా “ఓపెన్ సోర్సు” తో లాభాలు. అదే ఏదయినా క్లోస్డ్ సోర్సు ఆపరేటింగు సిస్టమయితే వారు సపోర్టు చేసేదాకా ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడయితే ఎంచగ్గా మనమే సోర్సు మార్చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు.)

ఇక తరవాతది వీపీఎన్ ఆక్సెసు. మా కంపెనీ ఉపయోగించే వీపీఎన్ కి vpnc ఉపయోగించి కనెక్టు కావచ్చు. కానీ వీపీఎన్ కి కనెక్టు కావడానికి వన్‌టైము పాస్వర్డు సృష్టించే ఇంకో సాఫ్టువేరు ని జతగా వాడతారు. ఆ క్లయింటు ఏమో విండోసు మీద పనిచేసేది. ఇక దానికోసం వైన్ ఉపయోగించాల్సొచ్చింది. దాని కమాండు లైను వర్షను ఈఎక్షీ కనుగొని దానికి సంబంధించిన రిజిస్ట్రీ ఎంట్రీలను వైన్ కి జోడించడంతో అది లినక్సులో పనిచెయ్యడం మొదలెట్టింది. కానీ ఇక్కడ ఇంకో సమస్య తెలెత్తింది ఏంటంటే ఈ సాఫ్టువేరు ఒక dat ఫైలు ఉపయోగించుకుంటుంది. అది వన్‌టైము పాస్వర్డు సృష్టించిన ప్రతీ సారీ మారుతుంటుంది. మరి నేను దానిని లినక్సు లో వాడితే మరుసటి సారి అది విండోసు లో పని చెయ్యదు ఎందుకంటే ఆ dat ఫైలు సింక్రనైజు అయి ఉండదు కాబట్టి. దానికి నేనేమి చేసానంటే ఇంతకు ముందు మౌంటు చేసిన విండోసు పార్టీషను లో ఉన్న ఆ ఫైలుకి ఒక సింబాలిక్ లింకు సృష్టించాను. కాబట్టి ఇక ఆ dat ఫైలు మారినా సింక్రనైజ్డు గా ఉంటుందన్నమాట.
ఇక అక్కడితో దాదాపు అన్ని సమస్యలూ తీరినట్టే ఒక్కటి తప్ప.

అదేంటంటే ఇంట్లోంచి మీటింగులు అటెండు కావడానికి మేము “ఐపీ కమ్యూనికేటరు” (సాఫ్టు ఫోను) ఉపయొగిస్తాము. కానీ మేము వాడే ప్రోటోకాలు ఓపెన్ కాదు. కాబట్టి దానికి లినక్సు లో క్లయింటు దొరకలేదు. దానికి ఏదన్నా ప్రత్యామ్నాయం దొరికితే ఇక విండోసు లోకి బూటు చెయ్యాల్సిన అవసరమే లేదు. లేదా కనీసం క్లయింటుని వైను ద్వారా పరిగెత్తించగలిగితే సరిపోతుంది.

అదన్నమాట ఒక ప్రహసనం. ఒక రోజంతా కష్టపడినా సరే మొత్తానికి లినక్సు కి మారిపోవడం చాలా సంతోషాన్నిచ్చింది.

అన్నట్టు ఎవరయినా KDE4 ప్లాస్మా ట్రై చేసారా ? కొత్తగా తయారవుతున్నట్టుంది. మాక్ లాగా డాక్ బార్ అదీనూ… ఆల్రడీ కుబుంటు “హార్డీ” కోసం ఆల్ఫా వర్షను ఇంటిగ్రేట్ అయి ఉంది.