హాథీ కా అండాలా…

అది మా రాగింగ్ టైం అన్నమాట.

ఇంకా మమ్మల్ని north, south, రాష్ట్రాల ప్రకారం వర్గీకరించలేదు. (నేను కర్ణాటక లో చదివా లేండి. నవీన్ (పూతరేక్స్) మా సీనియరే.) హాస్టల్ లో కొత్త రోజులు. అందరమూ బిక్కు బిక్కు మని గడుపుతున్నాము. ఎక్కడ ఏమి ఆపద ముంచుకు వస్తుందో అని.

అనుకుంటున్నట్టుగానే సీనియర్ల నుంచి పిలుపు వచ్చింది. అక్కడ ఏమి ఎదురవుతుందో అని తలచుకుంటూ భయం భయం గా వెళ్ళాము.

మేడ మీద ఒక రూము లోకి పిలిచారు మమ్మల్నందరినీ. అందరినీ వరసగా నుంచోమన్నారు. నుంచున్నాము. అందరినీ తమ తమ పరిచయాలు చేసుకోమని చెప్పారు. మొదలెట్టాము. ఒక్కొక్కరి పరిచయాలూ అయ్యాయి. మేము కూడా ఒకరి గురించి ఒకరం అప్పుడప్పుడే తెలుసుకుంటున్నాము.

సరే అయ్యిందనిపించి తరవాత డాన్స్ చెయ్యమన్నారు. మామూలుగా అయితే ఇరగ దీసి డాన్స్ చేసేవారు (తరవాత తెలిసింది అనుకోండి, నేనూ కొద్దొ గొప్పో డాన్స్ తెలిసినవాడినే) కూడా అమ్మో ఎక్కడ ఎవరేమంటరో ఏమో అని ఎదో చేతులూ కాళ్ళూ ఆడిస్తున్నారు. సీనియర్లకి విసుగు పుట్టినట్టుంది, ఇక చాలు ఆపండి అన్నారు. అందరం కదలడం ఆపేసాము. తరవాత ఒక్కొక్కరినే పాటలు పాడమన్నారు. సరే ఇక మన గొంతులు ఎంత శ్రావ్యమయినవో అందరికీ తెలిసిందే, ఒకటే కాకి గోల. అందరూ వరసగా పాడుతున్నారు. నేనూ పాడేసాను. ఇంతలో నా స్నేహితుడు పునీత్ వంతు వచ్చింది. అతను హిందీ పాట “ఆతీ క్యా ఖండాలా…” (అమీర్ ఖాన్ సొంతంగా పాడిన పాట – ఘులాం లోది) అందుకున్నాడు.

అది ఇలా సాగింది

“ఏ క్యా బొల్తీ తూ…
ఏ క్యా మే బోలూ…
సున్
సునా
హాథీ కా అండాలా…”

అందరూ ఒక్కసారి ఆశ్చర్యంగా అతడి వంక చూసారు ఎందుకంటే అక్కడ ఉండాల్సిన లైను “ఆతీ క్యా ఖండాలా”. దాన్ని మనోడు “హాథీ కా అండాలా…” అని మార్చేసాడు.

అంత వరకు కొద్దిగా serious గా ఉన్న సీనియర్లందరూ ఒక్కసారిగా ఘొల్లు మన్నారు.

అబ్బో ఇలాంటి ఎన్నో సందర్భాలు లెండి కాలేజీ జీవితంలోనూ, హాస్టల్ లోనూ. గుర్తు వచ్చినప్పుడల్లా చెబుతుంటా…