త్రివిక్రముడూ, మేమూ …

ఓ శనివారం రోజు, నేనూ ప్రదీపూ బయల్దేరాము…. ఎందుకూ ? త్రివిక్రముడిని కలుసుకోవడానికి.
ఎవరీ త్రివిక్రముడు ? ముందెళ్ళి పొద్దు చూసి రండి. తరువాత కూడా తెలీకపోతే నేనేమీ చెయ్యలేను.

ఎలా మొదలయిందా, ముందు పప్పు నాగరాజు గారు (ఏమిటి ఆయన తెలీదా ? అయితే సాలభంజికలు కేసి ఓ లుక్కేసి రండి.) నాకు ఓ వేగు పంపించారు. కొత్తగా పెళ్ళయిన మన త్రివిక్రముడు ఊళ్ళోనే ఉన్నాడు, కలుద్దాము అని. సరే అని నేను ఆయన దగ్గర నుండి త్రివిక్రం ఫోన్ నంబర్ తీసుకుని ఆయనకి కాల్చేసా. ఆయనతో మాట్లాడి ఎట్టకేలకు ఆ శనివారం కలుద్దామని డిసైడైపోయాము.

అంతకు ముందు వారమే నేను బెంగుళూరు eతెలుగు సమావేశం కోసం పిలుపిచ్చా. నాకు తెలుసు ఎలాగూ నవీన్, ప్రదీపు, నేను తప్ప ఎవరొచ్చినా బోనస్సే అని 🙂
ప్రదీపు గారొస్తానన్నారు, కాకపోతే ఈ సారి నవీన్ అన్న కూడా కుదరదనేసారు.
నాకు మాత్రం మొదటి సారి మన భాగ్యనగరం నుండి మనోళ్ళని కలుద్దామని ఉత్సాహంగా ఉంది.

అలా లాల్‌బాగ్ లో కలుద్దామని అనుకుని ప్రణాళికేసుకున్నాము. సరే అని అందరికీ ఓ వేగు పంపించి ఊరకున్నా. కాకపోతే ప్రదీపు గారి దగ్గర నుండి తప్పితే ఎవరి దగ్గర నుండీ తిరుగు వేగు రాలేదు. అలా నాగరాజు గారు హాతిచ్చారన్నమాట 🙂
అయినా సరే పట్టు వదలకుండా ఇద్దరమయినా సరే వెళదామనుకున్నము బెంగుళూరు పరువు నిలబెడదామని. మొత్తానికి ఆఖరు నిముషంలో త్రివిక్రముడికి కుదరకపోవడంతో ఆయన ఇంటికి దగ్గరగాగా లొకేషన్ మార్చాము.

హహహ… ఇక్కడ జోకేమిటంటే ప్రదీపు గారికి గానీ, నాకు గానీ ఆ చోటు తెలీదు 😛
సరే అని ఎలాగో నా మొద్దు నిద్దర నుంచి లేచి శనివారం రోజు ఎందుకయినా మంచిదని ప్రదీపు గారికి ఓ కాల్చేసా. ఆయన కూడా నాలాగే నిక్కచ్చి మనిషి. టైము కి మా ఇంటి వద్దకి వచ్చేసారు. నా ద్విచక్ర వాహనం అసలే ఈ మధ్య ఓ పేద్ద ఆక్సిడెంటు నుంచి కోలుకుని తెగ కండీషన్ లోకొచ్చేసింది. అలా భగవంతుని మీద భారమేసి, వెనకాల ప్రదీపు గారిని కూర్చోబెట్టుకుని నా వాహనాన్ని పరిగెత్తించా.

అంత పొద్దున్నే (అబ్బా మాకంతే లేండి, ఎనిమిది తొమ్మిది గంటలు కూడా మాకు పొద్దున్నే) అలా గల్లీల్లో తిరిగి తిరిగీ, ముందు కెళ్ళి వెనక్కొచ్చి అటు తిరిగీ ఇటు తిరిగీ ఎలాగయితే ఆయన చెప్పిన బండ గుర్తు దగ్గరికి చేరుకున్నాము. అక్కడకి చేరాక త్రివిక్రముడికి మళ్ళీ కాల్చేసా. ఆయన వచ్చి మమ్మల్ని ఏరుకుంటానని చెప్పారు (అదే పిక్ చేసుకుంటానన్నారు). ఇద్దరమూ ఇంకాసేపు మళ్ళీ ఆయనకి కాల్చేసాను. రోడ్డుకెదురుగా ఒకాయన మొబైల్ తీసి మాట్లాడుతుండడం చూసి చేయూపాను. అలా ఆయన దృష్టినాకర్షించాలని కాసేపు ప్రయత్నించా. అంతలో త్రివిక్రముడు ఫోనులో ఇంకా రాలేదు వస్తున్నా అన్నారు. ఆ… అక్కడ రోడ్డుకెదురుగా ఈయన కాదా అని చటుక్కున నా చేయి దించా. అక్కడున్నాయన పిచ్చోళ్ళని చూసినట్టు చూసుంటాడు.

అలా ఇంకాసేపు ఎదురుచూసిన తరవాత త్రివిక్రముడే కాల్చేసారు. ఈ సారి ఆయనే అని నిర్థారించుకునే వరకూ చేయూపలేదు. అలా ఆయన తంటాలు పడి రోడ్డు దాటొచ్చారు. కలిసిన ఆనందంలో అలా మాట్లాడుకున్నాము కాసేపు. తరవాత ఎదురుగా దర్శిని ఓటి కనిపిస్తే కడుపులో ఏనుగులు పరిగెత్తాయి. అందులో మా అదృష్టం కొద్దీ కూర్చుని తినే చోటుంది. తెలీని వారికి బెంగుళూరులో దర్శిని అంటే నిలుచుని తినే ఓ చిన్న హోటలు. ఇక అక్కడ మాటల ప్రవాహం మొదలయింది. బ్లాగుల గురించి, బ్లాగరుల గురించి, పొద్దు గురించి, అక్కడ రచనలు అవీ ఎలా జరుగుతాయో, ఎవరిని ఆహ్వానిస్తారో అన్నీ చెర్చించాము.

అలా ఓ రెండు దోశలు, ఓ పూరీ మా దాటికి బలయ్యాయి. బిల్లు కి బలయ్యింది మాత్రం త్రివిక్రముడే. తరవాత అలా రోడ్డు వెంబడి నడుస్తున్నాము. కాసేపు నెనూ, ప్రదీపూ సినిమాల గురించి మాట్లాడి ఆయనకి బోరు కొట్టించాము. కాసేపు కొన్ని నవ్వులు పూసాయి మా మధ్య. తరవాత ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. పెళ్ళి ఇల్లు అని చెప్పి ఇంకో డోసు “అల్పాహారం” మా చేత తినిపించారు. కజ్జికాయలు, ఉప్మా మొదలయినవన్నీ నెమ్మదిగా కడుపులోకెళ్ళిపోయాయి. అలా ఇంకొంత సేపు అనేక విషయాల గురించి మాట్లాడాము. అలా మాట్లాడుతుంటే ఓ సారి సమయం చూసా. ఆయన ఆ రోజే హైదరాబాదు తిరిగెళ్ళిపోవాల్సుండడంతో టిమయ్యిందని గ్రహించి మమ్మల్ని గెంటేయకముందే 😉 బయల్దేరాము.

అలా ఇంటికొచ్చి నేనయితే నాకిష్టమొచ్చిన వ్యాపకం మొదలెట్టాను (అదే కుంభకర్ణుడికీ నాకూ కామన్ ఇంటరెస్టు).

అదేంటీ పోయిన శనివారం జరిగితే ఇప్పుడు రాస్తున్నాననుకుంటున్నారా… అదంతే. నే రాయాల్సిన టపా ఓ జీవిత కాలం లేటు. ప్రదీపూ 🙂