నక్షత్రాలు భూమి మీద …

నక్షత్రాలు భూమి మీద…

అమీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా…
ఎంతో బాగుంది. నాగరాజు గారి బ్లాగులో నా వ్యాఖ్య చూస్తేనే నాకు సినిమా బాగా నచ్చిందని తెలుస్తుంది 🙂

ఈ కాలంలో సినిమాలు ఎంచుకోవడం లో, నిర్మించడంలో విభిన్నంగా ఉన్నాడంటే అది ఒక్క అమీర్ ఖానే. నేను అతనికో పెద్ద పంఖాని.

అమీర్ ఖాన్ సినిమాలన్నిటిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. విషయముంటుంది. (ప్రత్యేకమయిన విషయం లేని “దిల్ చాహ్తా హైన్ ” నా ఫేవరెట్టనుకోండి)
లగాన్, రంగ్ దే బసంతీ, ఇప్పుడు తారే జమీన్ పర్…

ఈ సినిమా “డిస్లెక్సియా” ఉన్న ఒక కుర్రాడి గురించి. కానీ ఈ సినిమా కేవలం దాని గురించే కాదు.
డిస్లెక్సియా వల్ల చదవడంలోనూ, విషయాలను ఆకళింపు చేసుకోవడంలోనూ ఇబ్బందులెదురవుతాయి. కానీ అది నయం కాని వ్యాధి కాదు.
డిస్లెక్సియా ఉన్న వారు మిగతావారికంటే ఎక్కువ సమయం తీసుకుంటారు అంతే.

ఇక ఈ సినిమా విషయానికొస్తే ఒక చిన్న కుర్రాడు ఈ వ్యాధి వల్ల ఎలాంటి పరిస్థితులెదురుకున్నాడు, దానిని జయించి ఎలా విజయం సాధించాడు అనేదే.
కానీ వ్యాధి విషయం పక్కన పెట్టినా సినిమా అర్థవంతంగానే ఉంటుంది ఎందుకంటే ఈ కాలంలో పిల్లల మీద ఉన్న ఒత్తిడి అలాంటిది.

మొదటిది కాలంతో పాటూ పరిగెత్తడం. ఒక్క నిముషం లేటయితే, ఆగితే మిగతా వారు ముందుకెళ్ళిపోతారు.
అలా జరగకూడదని తల్లిదండ్రులు పిల్లలను అలా తోస్తూనే ఉంటారు. అది ఆ పిల్లలు సహించగలరా ? లేదా ? అనేది పట్టట్లేదు.
అందరు పిల్లలూ ఒకేలా ఉండరు. కొంత మంది బ్రిలియంట్లు ఒక్కసారి చదవగానే పట్టెయ్యగలుగుతారు. కొంత మంది పది సార్లు చదివి మననం చేసుకుంటే గానీ ఎక్కించుకోలేరు.
మరి రెండో వాడిని నువ్వు మొదటివాడిలా ఎందుకు లేవు ? అలా తయారవు అని తోస్తే ?
శక్తికి మించిన దానికోసం అనవసర ఒత్తిడి తెస్తే అది చిన్న వయసులోనే వారికి డిప్రెషను వంటివి కలిగిస్తుంది.

ఆ… ఇదంతా ట్రాష్ అని కొట్టి పారెయ్యడానికి లేదు. ఎందుకంటే ఈ మధ్య వచ్చే వార్తలు చూడండి ఒకసారి.
రాంకులు రాకపోతే ఆత్మహత్య. మార్కులు తక్కువొస్తే ఆత్మహత్య. ఇంకొన్ని సార్లు ఆ కోపం ఇతరుల మీద చూపించడం.
వాడి వల్లనే కదా నాకు తిట్లు పడుతున్నాయి. వాడే లేకుండా చేస్తే ? ఇలాంటి విపరీతమయిన ఆలోచనలు పిల్లల్లో కలుగుతున్నాయి.

అలాగని పిల్లలను చదవకుండా గారాలు చెయ్యమని ఎవరూ అనట్లేదు. కాకపోతే దేనికయినా ఓపిక అవసరం.
అదీ ముఖ్యంగా పిల్లలతో. వారికి నచ్చచెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాలి కానీ, దండించి కాదు.

ఇంత అద్భుతమయిన తల్లిదండ్రులు అండగా ఉంటేనే నాకు అప్పుడప్పుడు ఆ ఒత్తిడి ఉంటుంది.
ఇక మరి అలా అర్థం చేసుకోలేని తల్లిదండ్రులుంటే ?? ఆ పిల్లల సంగతి ?

“పీర్ ప్రెషర్” అనేది కేవలం పెద్ద వారికే కాదు. పిల్లలకీ ఉంటుంది.
కాబట్టి వీటన్నిటినీ జయించి ఒక మంచి మనసున్న మనిషిగా ఎదగాలంటే పిల్లల మీద తల్లిదండ్రుల పాత్ర ఎంతయినా ఉంది.

ఆ విషయమే అమీర్ ఖాన్ ఈ సినిమా ద్వారా చెప్పడానికి ప్రయత్నించాడు.
చాలా మటుకు సఫలమయ్యాడు.

పైన చెప్పిన వాటన్నిటితో పాటూ ప్రస్తుతం ఉన్న ఇంకొక సమస్య ఆల్టర్నేట్ కెరీర్స్ లేకపోవడం. (ఈ విషయం గురించి ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడాను నా బ్లాగులో…)
ఒకవేళ మనం మాథ్స్, సైన్సులలో పూరుగా ఉండి ఆర్ట్సు లో బాగా రాణిస్తున్నామనుకోండి. అయినా మనకు వేరే దిక్కు లేదు.
చివరికి వచ్చి కెరీరు ఆ రెండిటిలోనే. నీకు నచ్చింది చెయ్యడం కాదు. అవసరం ఉన్న దానికోసం నిన్ను నువ్వు మార్చుకోవడం.
అదే జరుగుతోంది ప్రస్తుత పరిస్థితులలో.

అది ఎంత మాత్రం మంచిది కాకపోయినా ప్రస్తుత పరిస్థితిలో అంతకన్నా ఏర్పాటు లేదు.
మరి నచ్చినదాన్ని చెయ్యకపోతే మరి ఆ పనిని సరిగా ఎలా చేయగలుగుతాము ? మొక్కుబడిగా తప్ప.

ఇలాంటి సొసయిటీలో వీటితో పాటు చదవటం, రాయడంలో ఇబ్బందులు ఎదురయితే ?? మరి అప్పుడు ఆ పిల్లాడిలో కలిగే మానసిక సంఘర్షణ ఊహాతీతం.
“ఇషాంత్ అవస్తీ” అనే అలాంటి ఒక కుర్రాడిని ప్రోత్సాహించి, అతనిలో ఉన్న కళను వెలికి తీసే “నికుంభ్”. వీరిద్దరి కథ ఈ “తారే జమీన్ పర్”.

సినిమా కథ కాబట్టి చివరికి ఎలాగో ఆ అబ్బాయి విజయం సాధిస్తాడనుకోండి. కానీ నిజ జీవితంలో అలా సాధించగలిగే వారు ?
లేరని కాదు. సినిమాలో చెప్పిన ప్రఖ్యాతి గాంచిన వారే గాక ఇంకెందరో దీని బారిన పడ్డారు. కానీ జీవితంలో పోరాడి గెలిచారు.
మామూలు వ్యక్తులకి సాధించలేనిది సాధ్యం చేసి చూపించారు.

దేనికయినా పట్టుదల అవసరం. ప్రోత్సాహం అవసరం.
ఆ రెండూ కలిస్తే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదు.

ఈ నిజాన్నే చెప్పిన సినిమా “తారే జమీన్ పర్” ని తప్పకుండా చూడండి.

మరికొన్ని విషయాలు:

కొన్ని సినిమాలని టెక్నికాలిటీ దృష్టితో చూడలేము. టెక్నికల్గా ఇది వంద పర్సెంటు కరెక్టుగా లేదు అని మార్కులు వేయలేము.
కొన్ని చోట్ల ఎసెన్సు గుర్తించడం ముఖ్యం. ఆ సినిమా తెచ్చిన అవేర్‌నెస్ ముఖ్యం.
అనుభవించిన వారికి మాత్రం ఈ సినిమాలోని విషయాలు అర్థమవుతాయి.

సినిమాలో నటన పరంగా “దర్శీల్ సఫరి” అద్భుతంగా నటించాడు.
“అమీర్ ఖాన్” గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర ఇంట్రడక్షనే ఇంటర్వెల్ తర్వాత అవుతుందంటే మీరు ఊహించుకోవచ్చు. ఈ సినిమా అమీర్ ఖాన్ కంటే పెద్దదని.
ఈ సినిమాలో హీరో అంతర్లీనంగా చూపిన నిజాలు….

నిజంగా భూమి మీద వెలసిన నక్షత్రం ఈ సినిమా…