సమాచారం భారమా ?

ఈ సమాచార కాలంలో సమాచారం భారమే అనిపిస్తుంది.
ఈ సమాచార విప్లవం వేటితో సాధ్యమయిందో మనందరికీ తెలుసు. అందుకు దోహదపడినవి ఈ మెయిలు, ఇంటర్నెట్ మెసెంజరు, వెబ్‌సైట్లు, బ్లాగులు, ఆరెసెస్ ఫీడ్లు, వగయిరా వగయిరా.

పైన చెప్పినవాటన్నిటి నుంచి మనకు రోజూ ఎంతో సమాచారం అందుతుంది. కొంత ఉపయోగపడేది, కొంత చెత్త (చాలా మటుకూనేమో)

ఇది వరకులో అయితే “నాలెడ్జ్ ఈజ్ పవర్” అంటే సమాచారం శక్తివంతం అన్నమాట. కానీ సమాచారం భారమే అనిపిస్తుంది ఈ కాలంలో సరయిన ఫిల్టర్ లేకపోతే. దీనికి ఓ టర్మ్ కూడా కాయిన్ చేసారు “ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్” అని.

ఈ మెయిలు నే తీసుకోండి. అది మనకెంత మేలు చేస్తుందో అంతే కీడు కూడా. మన ఆఫీసు పనిలోనూ, మన వ్యక్తిగత పనిలోనూ దీని ఉపయోగం అనంతం. నేరుగా మాట్లాడక్కర్లేని సంగతులన్నీ ఈ మెయిలు ద్వారా డీటెయిల్డుగా పంపుకోవచ్చు. మరి ఇది భారమెలా అవుతుంది ?
అవుతుంది. ఎందుకంటే ఈ మెయిలు ద్వారా పంపే వేగులన్నీ ఇన్నీ కాదు. అలా హనుమంతుడి తోకలాగా పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు పదుల సంఖ్యల్లో ఉండే వేగులు ఇప్పుడు వందల సంఖ్యల్లోకి మారుతున్నాయి. ఇక పర్సనల్ మెయిళ్ళకయితే లెక్కలేదు.
కొంత మంది ఉంటారు ఆటో ఫార్వర్డు గాళ్ళు. ఇలా ఓ మెయిలొస్తే అలా దానిని తన మెయిలింగు లిస్టులలో ఉన్న జనాలందరికీ ఫార్వర్డులు చేసేస్తుంటారు. అది అవసరమా, పనికొస్తుందా ఏదీ ఆలోచించరు.
ఇంకొంత మందుంటారు మైక్రోసాఫ్టు లేదా ఏఓఎల్ ఈ మెయిల్ పది మందికి పంపితే మీకు పదివేల డాలర్లు వస్తాయి అంటే చాలు అదో వంద మందికి పంపించటమే. అందులో చదువుకున్న వారుంటారు, సాఫ్ట్‌వేరు జనాలుంటారు. ఏ మాత్రం బుర్ర ఉపయోగించరు.
ఇవే కాకుండా మెయిలింగు లిస్టులూ, సోషల్ నెట్వర్కుల నుండి మెయిళ్ళూ, స్పాం మెయిళ్ళూ అన్నీ కలిస్తే తడిసి మోపెడవుతుంది.  

తరువాత IM (ఇంటర్నెట్ మెసెంజరు) ల నుండి. ఏదో సీరియస్ గా పని చేసుకుంటుంటాము. సడన్ గా ఏ స్నేహితుడో హాయ్ రా మామా అని పింగ్ చేస్తాడు. అటు వాడిని ఫోరా అనలేము, ఇటు పని ఆపలేము. మల్టీటాస్కింగు చేస్తుంటాము, ఒకటే ఆల్ట్ టాబులు. ఇక ఆసక్తికరమయిన విషయానికి అది మళ్ళిందంటే అంతే సంగతులు. ఇటు పని కాస్తా పక్కన పెట్టి మరీ సొల్లు కబుర్లు చెబుతాము.
యాహూ, గూగుల్ టాక్, ఎమెసెన్ నుండి వందలాది స్నేహితులుండే వారికి ఇక రోజంతా ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు. అదే కాక ఇప్పుడు మన స్నేహితులు జగమంతా పాకి ఉన్నారాయే. ఈ సమయం, ఆ సమయం అని కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు పింగ్ చేస్తారు మరి. మీ రాత్రి వారికి పగలు కదా. అసలే వారికి ఏమీ తోచదు కదా. సరిగ్గా మీరు దుకాణం కట్టెయ్యడానికి మీ లాపుటాపు మూసెయ్యబోతుంటే మీ స్నేహితుడు “హాయ్” అంటాడు. ఇంకో గంట దండగ.

ఇక వెబ్సైట్లు, బ్లాగులు, ఆరెసెస్ ఫీడ్లు. జనాలకి జనరల్ గా ఒక అయిదు వెబ్సైట్లు అయినా ఫాలో అయే అలవాటుంటుంది. అవి వార్తల సైట్లు కావచ్చు, టెకీ సైట్లు కావచ్చు, బ్లాగులు కావచ్చు. వివిధ వెబ్సైట్ల నుండి ఫీడ్లు కావచ్చు. ఇవి కనబడకుండా సమయం తినేస్తాయి. కొన్ని సార్లు అవసరమయినదానికంటే కూడా ఎక్కువ సమాచారం అందిస్తాయి.
ఉదా: నాకు ఆరెసెస్ ఫీడ్లు చదివే అలవాటుంది. ఒక వంద దాకా ఫీడ్లు నా గూగుల్ రీడర్ లో ఉంటాయి. అన్నీ రెగులర్గా చదవను కానీ, కొన్ని చదువుతా. అవి చదువుతూ అవి ఇచ్చిన లంకెలను పట్టుకుని వెళుతుంటే గంటలు తరుగుతాయే తప్ప పని జరగదు.
వీటిలో ఇంకో ముఖ్యమయిన కాటగరీ సోషల్ నెట్వర్కులు. ఆర్కుట్, ఫేస్బుక్, వగయిరా వగయిరా లలో గంటల కొద్దీ ఏకధాటిగా గడపగలిగే వారిని నే చూసాను. అలాగే బ్లాగులు చదువుతూ కూడా. ఉదా: ఒకసారి కూడలి తెరిచారంటే కనీసం గంట సేపు అవుటు.

ఇవి కాక నిజ జీవితంలో మనకొచ్చే స్పాం కాల్స్, సెల్ ఫోను లో పలకరించే క్రెడిట్ కార్డు కంపెనీలు, ఉద్యోగావకాశాల భామలు, గర్ల్ ఫ్రెండులూ, కాని ఫ్రెండులూ, అవసరార్థ జనాలూ. తెలియకుండానే మీ సమయం హుష్ కాకి.

ఆలోచిస్తే పైన చెప్పినవన్నీ మనకు కావలసిన వనరులే. మనకెంతో ఉపయోగపడేవే. కానీ వాడుకలో వాటిని అతిగా వాడటమో, మిస్యూజ్ చెయ్యడమో చేస్తుంటాము. దాని వల్ల సమాచార భారం లో మునుగుతాము.

నన్ను వీటిల్లో ఎక్కువగా బాధ పెట్టినది అంతర్జాలం. వెబ్సైట్లు, బ్లాగులు, ఆరెసెస్ ఫీడ్లు వగయిరా చదువుతూ సమయం మర్చిపోతుంటాను. 

ఇక వీటిని అధిగమించడానికి నా స్వీయానుభవంతో నేను పాటించే కొన్ని చిట్కాలు:  

  • పొద్దున్న అరగంట సేపు మాత్రమే వెబ్సైట్లు, బ్లాగులు, ఫీడ్లు చదవటానికి గడుపుతాను. అటు తరవాత సాయంత్రం పని వేళల తరవాతే వాటిని తెరవడం. మధ్యలో లంచ్ తరవాత తెరిస్తే ఓ పది నిముషాలు.
  • పని క్రిటికల్ గా ఉన్నప్పుడు కాల్స్ అటెండ్ చెయ్యను. సెల్ ఫోను సైలెంటు మోడులో ఉంచుతాను. ఎలాగూ అత్యవసరమయితే (చాలామటుకు ఇంట్లో వారే) నా పని ఫోనుకి చేస్తారు. లేదా ఏ వాయిస్ మెయిలో వదిలిపెడతారు.
  • సోషల్ నెట్వర్కులకి సాధ్యమయినంత తక్కువ సమయం కేటాయించడం. అడిక్షన్ ఎప్పుడూ లేదు కానీ వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. వీటి వల్ల ఎక్కువ సమయం కోల్పోను.
  • మెయిల్స్ ని ఖచ్చితంగా పర్సనల్, నాన్ పర్సనల్ గా విభాగిస్తాను. పొరపాటున కూడా నా కంపెనీ మెయిలు ఐడీ పర్సనల్ మెయిళ్ళకి ఉపయోగించను. స్నేహితులకు సాధ్యమయినంత వరకూ ఇవ్వను/ప్రోత్సాహించను.
  • ఆఫీసు మెయిళ్ళన్నిటికీ రూల్స్ లేదా సెర్చ్ ఫోల్డర్లు ఏర్పాటు చేసుకున్నాను. ఒక్క క్లిక్కుతో అనవసరమయిన మెయిళ్ళాన్నీ డిలీట్ చెయ్యవచ్చు, లేదా చదివినట్టు మార్క్ చెయ్యవచ్చు.
  • పర్సనల్ మెయిళ్ళన్నీ నా థండర్బర్డు లోకి వస్తాయి. అందులో వివిధ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకున్నాను. ఉదా: తెలుగుబ్లాగు, తెలుగువికీ, ఉబుంటు మెయిలింగు లిస్టు, స్నేహితులు, జంక్ (ఆటో ఫార్వర్డు గాళ్ళ మెయిళ్ళన్నీ ఇందులోకే) వగయిరా.
    నాకున్న ఒకే ఒక వీక్నెస్సు తరచుగా మెయిళ్ళు చెక్ చేసుకోవడం. దాదాపు ప్రతీ గంటకీ చెక్ చేసుకుంటా. ఇంట్లో ఉంటే ఆల్వేస్ ఆన్ ఎలాగూ.

  • మెసెంజరు లో ఆఫ్లైన్, ఇన్విజిబుల్ లేదా అవే మోడులలో ఉంటాను అవసరమయిన పని చేసేటప్పుడు. ఆన్లైనులో ఉన్నా రెస్పాండ్ కాను. అందుకే మెల్ల మెల్లగా నన్ను అవసరమయిన జనాలు తప్ప వేరే వారు పింగ్ చెయ్యటం తగ్గించారు.
  • అన్నిటికన్నా ముఖ్యం సెల్ఫ్ కంట్రోల్. మొదట్లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక చాలా సమయం కోల్పోవడం జరిగేది. కొన్ని నెలలు అలా ఇబ్బంది పడిన తరువాత నెమ్మదిగా అలవాట్లన్నీ కంట్రోల్ చేసుకోవడం మొదలుపట్టాను.
  • వీకెండులలో ఆఫీసు కి వెళ్ళను, కనెక్టు అవను. మెయిళ్ళు చూడను. అలాగే ఇంటికొచ్చిన తరవాత ఆఫీసు పని చూడను. తొంభై శాతం ఇందులో సఫలం కాగలిగాను ఇంతవరకూ.
  • సొల్లు కబుర్లు చెబుతాను కానీ ఎక్కువగా లంచ్ టైము లేదా టీ టైముల్లో. ఐదు నిముషాల బదులు పదిహేను నిముషాలు టీ తాగుతాము అంతే తేడా. ఇది ఫరవాలా.

క్రికెట్టున్నప్పుడు మాత్రం పైవన్నీ ఎగిరిపోతాయి. ఎందుకంటే అదొక్కటే సరిపోతుంది. టీవీ కి అతుక్కుపోవడం, స్కోరు బోర్డు రిఫ్రెష్ చెయ్యడం, క్రికెట్టు సొల్లు కబుర్లు చెప్పుకోవడం, ఇండియన్ కెప్టెన్, టీం ని ఎన్నుకోవడానికి, మాచ్ అనాలసిస్ కీ చాలా సమయం వెచ్చించాల్సొస్తుంది.
ఈ మధ్య కొత్తగా వీటికి తోడయింది పని దగ్గర క్యూబుల మధ్యలో క్రికెట్టాడటం. ఓ అరగంట సేపు మటాష్. కానీ మంచి ఫిజికల్ ఎక్సర్సైజు మరి అందుకే మానట్లేదు 😉

సరయిన మేనేజ్‌మెంటు లేకపోతే మాత్రం మనకు ఇబ్బందులు తప్పవు. ఎక్కడో అక్కడ మనకు వీక్నెస్సులు ఉంటూనే ఉంటాయి. వాటిని గమనించుకోవలసిందే లేకపోతే అంతే సంగతులు.

2 thoughts on “సమాచారం భారమా ?

  1. Congratulations!

    సమయాన్ని సరిగ్గా వాడుకోగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    ఈ మధ్యే నేనూ నా సమయాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి మనఃస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను.

    నాకు ఇష్టమైన పనులు చెయ్యడానికి (కూడలి, తెలుగు గుంపులు included) నేను ప్రత్యేకమైన సమయం సృష్టించుకోగలుగుతున్నాను. అదీ major achievement. మిగిలిన సమయంలో కాస్త నియంత్రణ ఇంకా అవసరం ఉంది ఇంకా. ఉదాహరణకు, కంప్యూటరు దగ్గరుంటే చాలు, వేరే పని మీదున్నా, కూడలి వైపు మౌసు లాగుతూనే ఉంటుంది. దాని ఫలితమే ఈ వ్యాఖ్య. అయితే, నమ్మకం ఉంది. సాధనమున పనులు సమకూరు ధరలోన.

  2. Congratulations!సమయాన్ని సరిగ్గా వాడుకోగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్యే నేనూ నా సమయాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి మనఃస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఇష్టమైన పనులు చెయ్యడానికి (కూడలి, తెలుగు గుంపులు included) నేను ప్రత్యేకమైన సమయం సృష్టించుకోగలుగుతున్నాను. అదీ major achievement. మిగిలిన సమయంలో కాస్త నియంత్రణ ఇంకా అవసరం ఉంది ఇంకా. ఉదాహరణకు, కంప్యూటరు దగ్గరుంటే చాలు, వేరే పని మీదున్నా, కూడలి వైపు మౌసు లాగుతూనే ఉంటుంది. దాని ఫలితమే ఈ వ్యాఖ్య. అయితే, నమ్మకం ఉంది. సాధనమున పనులు సమకూరు ధరలోన.

వ్యాఖ్యానించండి